Jana Sena’s National Expansion Plan
కేసీఆర్‌ను ఇరికించిన రేవంత్
ఒట్టేసి చెప్పు అంటూ సవాల్!
తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ, పొత్తుల అంశం అప్పుడే వేడి పుట్టిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఆరోపిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెబుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఒక టీమ్‌గా.. బీజేపీ, బీఆర్ఎస్ మరో టీమ్‌గా తలపడతాయని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా, బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ ఒట్టేసి చెప్పాలని రేవంత్ సవాల్ విసరడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును పూర్తిగా తనవైపు తిప్పుకోవాలనే వ్యూహంతోనే రేవంత్ ఈ చర్చను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఈ సవాల్‌పై స్పందించకపోతే, ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ నిజమేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూనే, ఇటు పొత్తుల అంశంతో ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టేలా ముఖ్యమంత్రి మైండ్ గేమ్ మొదలుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, ప్రతిరోజూ కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ సాధారణంగా ఇలాంటి సవాళ్లకు స్వయంగా స్పందించరనే అంచనాతోనే రేవంత్ రెడ్డి ఈ పాచిక విసిరారని తెలుస్తోంది. పార్టీ అధినేత కాకుండా ఇతర నేతలు ఎన్ని వివరణలు ఇచ్చినా అది అంత ప్రభావం చూపదని కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి ఆడుతున్న ఈ పొత్తుల మైండ్ గేమ్‌ను గులాబీ దళం ఏ విధంగా తిప్పికొడుతుంది, ప్రజల్లోకి తమ వాదనను ఎంత బలంగా తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
