Stop Threats Against Artisan Workers: IFTU
ఆర్టిజన్ వర్కర్స్ పై బెదిరింపులు మానుకోవాలి ఐఎఫ్టీయు
శ్రీరాంపూర్ : నేటిధాత్రి
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు చర్యలు మానుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర నాయకులు డి బ్రహ్మానందం అన్నారు. గురువారం శ్రీరాంపూర్ లోని జిఎల్బికేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సుమారు 20వేల మంది నిరవధిక సమ్మెలోకి వెళ్లారని పేర్కొన్నారు. విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ విద్యుత్ కార్మికులను టర్మిడెంట్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు.విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారని వివరించారు. విద్య అర్హతలు ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈసి రూల్స్ వర్తింపచేసి అమలు చేయాలని, టీజీ ఎన్సీడీసీఎల్ ను టీజీ ఎస్పీడీసీఎల్ లలో విలీనం చేయాలని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 2016. డిసెంబర్ 4 ముందు ఉండే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని 2016 పి అర్సిని అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఈ సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల పట్ల మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు తమ విధానాలను మానుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు ఇదే పట్టుదలతో మొక్కబోని ధైర్యంతో సమ్మెను కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఐఎఫ్టియు జిల్లా నాయకులు శంకరి సత్యం, కొదురుపాక సదానందం, జగన్నాథ్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
