Govt Urged to Act on RTC Workers Strike
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి
సమ్మె నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు – నర్సంపేట ఘటనపై ఆవేదన
ఏఐసిటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి
కేసముద్రం/ నేటి ధాత్రి
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని ఎంసిపిఐ(యు) అనుబంధ కార్మిక సంఘం ఏఐసిటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. నర్సంపేటలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరమని, ఇది కార్మికుల మానసిక ఒత్తిడికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే పే స్కేలు వర్తింప చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. వేతన సవరణలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలు అత్యవసరంగా పరిష్కరించాల్సినవని తెలిపారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించాలని మొగిలి సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్టీసీ సేవలు ప్రజలకు అత్యంత కీలకమైనవని, వాటి సజావుగా నడవడం కోసం కార్మికుల సంక్షేమం ముఖ్యమని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదిస్తే సమ్మెను విరమించేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
