Fire Destroys 6 Acres of Maize Crop
పర్షనాయక్ తండాలో అగ్నిప్రమాదం
6 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 16వ వార్డు పరిధిలో ఉన్న పర్ష నాయక్ తండాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 6 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాలి బూడిదగా మార్చాయి.ఈ ఘటనలో తండాకు చెందిన బానోతు సమ్మయ్య, బానోత్ మేఘా, బానోతు రవి, బానోత్ కిషన్, బానోతు నారాయణ, భానోత్ సారయ్య, భానోత్ హరి సింగ్, భానోత్ వీరస్వామిలకు చెందిన పంట నష్టం వాటిల్లింది. మంటలు గమనించిన వెంటనే స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించడంతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో సమీపంలోని ఇతర పంట పొలాలకు ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న స్థానిక కౌన్సిలర్ భానోత్ నవీన్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని బాధిత రైతులను పరామర్శించారు. ఆయన సూచనల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంచనామా నిర్వహించారు. అగ్నిప్రమాదం వల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన్ నాయక్ మాట్లాడుతూ, పంట చేతికి వచ్చే సమయంలో అగ్నిప్రమాదం సంభవించడం రైతులకు తీవ్ర దెబ్బ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు ప్రత్యేక నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
