మహిళల స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణలు దోహదం
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్
నర్సంపేటలో ఉచిత టైలరింగ్, మగ్గం శిక్షణ ప్రారంభం, 70 మందికి సర్టిఫికెట్ల పంపిణీ
నర్సంపేట, నేటిధాత్రి:
మహిళల స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని నర్సంపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.శుక్రవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ వరంగల్ సహకారంతో, ప్రతిభా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నర్సంపేట విస్డం స్కూల్ ఆవరణలో ఉచిత టైలరింగ్, మగ్గం శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవం, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంస్థ డైరెక్టర్ సహాయ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలు లేక మహిళలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల పిల్లలతో పాటు వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

అటువంటి పరిస్థితిని నివారించేందుకు నైపుణ్య శిక్షణలు ఇవ్వడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి మార్గాలను ఏర్పరచుకుని స్వయంసౌలంభన సాధిస్తారని తెలిపారు.ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బత్తుల కరుణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడుల నివారణ, మహిళా సాధికారత కోసం సంస్థ ఉపాధి ఆధారిత శిక్షణలు ఇస్తోందని తెలిపారు. మహిళలు, పిల్లలపై హింస లేకుండా ఉండడమే లక్ష్యమని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈకార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, ఫైనాన్స్ మేనేజర్ ఎం.అజయ్ కుమార్, కౌన్సిలర్లు జూలూరి రోజారాణి, రామోజీ రోజారాణి, వేల్పుల శ్రీలత, ఏసీడీపీఓ జ్యోతి, ట్రైనర్లు శ్వేత, సంధ్య, షరీఫా, ప్రతిభా సేవా సంస్థ కార్యదర్శి గిరిగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సేవా సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్, బోయిన వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.అనంతరం సుమారు 70 మంది మహిళలు పాల్గొన్నారు. మగ్గం, టైలరింగ్ శిక్షణకు సామాగ్రిని ఉచితంగా అందజేశారు. గతంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
