Collector Inspects Paddy Procurement Centers
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలం లక్ష్మరెడ్డిపల్లి, భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నాణ్యతను మాయిశ్చర్ మీటర్ ద్వారా పరీక్షించారు.
ధాన్యంలో మాయిశ్చర్ శాతం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆలస్యం జరుగకుండా కొనుగోలు చేసి వెంటనే కేటాయించిన ధాన్యం మిల్లలకు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం ఎప్పుడు తీసుకొచ్చారో, మాయిశ్చర్ శాతం ఎంత ఉందో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే, కొనుగోలు కేంద్రాల్లో హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేసి, లోడింగ్ మరియు అన్లోడింగ్ పనులు వేగంగా నిర్వహించాలని తెలిపారు.
ధాన్యం రవాణాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కౌలు రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం రాములు తదితరులు పాల్గొన్నారు.
