జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని సుముఖ గోదాము, మండల కేంద్రంలోని జయలక్ష్మి రైస్ మిల్ లను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని,కొనుగోలు కేంద్రాల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని, సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఒకరోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు.వరి ధాన్యం కొనుగోలు,దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలను సమకూర్చడం జరుగుతుందని,రైస్ మిల్లుల యజమానులు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని తెలిపారు.రైస్ మిల్లర్ల యజమానులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
