avinithipia lelalapia uluku ledu…paluku ledu, అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ గత వారంరోజులుగా ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వస్తున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లైన అనిపించడం లేదా…అవినీతి లీలలపై నేటి వరకు విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ క్యాంప్‌లో బాయ్స్‌ పేరిట, పేపర్‌ వాల్యూవేషన్‌ సబ్జెక్టులవారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో లెక్కకు మించి లెక్చరర్లు పనిచేసినట్లు తప్పుడు పేర్లను రాసి చెక్కుల ద్వారా కార్యాలయ ఉద్యోగ సిబ్బందికి చెందిన సన్నిహితుల అకౌంట్లలో జమ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా నేపథ్యంలో ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తప్పుబడుతున్నారు.

విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి

‘నేటిధాత్రి’లో వచ్చిన వరుస కథనాల ఆధారంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి బాగోతంపై ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి బిల్లుల చెల్లింపులు జరిగిన రోజు వరకు ప్రభుత్వం పేపర్‌ వాల్యూవేషన్‌ కోసం ఎంత బడ్జెట్‌ను కేటాయించింది…ఎంత మందికి చెల్లించారు…ఎవరెవరికీ ఎంతెంత చెల్లించారు…క్యాంపులో పనిచేసిన వారెంతమంది…క్యాంపు కార్యాలయంలో పనిచేసినట్లుగా రిజిస్టర్లలో నమోదైన పేర్లు, వారి సంతకాలు…సబ్జెక్టులవారీగా పేపర్‌ వాల్యూవేషన్‌ చేయడానికి మొత్తం ఎన్ని బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డులో ఎంతమంది లెక్చరర్లు పనిచేశారు. వీరికి ఎంతెంత చెల్లించారు. పలు విషయాలపై ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేపడితే దొంగలు దొరుకుతారని విద్యార్థి, ప్రజాసంఘాలు తెలుపుతున్నాయి.

బాధ్యులను సస్పెండ్‌ చేయాలి

క్యాంపు కార్యాలయంలో పనిచేయకున్నా పనిచేసినట్లుగా లెక్కకు మించి పేర్లు రాసి చెక్కుల ద్వారా చిక్కుల లెక్కలతో చెల్లింపులు చేసినా కార్యాలయ అవినీతి ఉద్యోగ సిబ్బందిని వెంటనే గుర్తించి సస్పెండ్‌ చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో 23మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఒకవైపు రాష్ట్ర ప్రజలను విషాదం వెంటాడుతున్నా తమకేమి పట్టనట్లుగా అక్రమంగా సంపాదనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నా ప్రతి ఒక్కరిని ఉపేక్షించకుండా సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *