– మీ సేవల సెంటర్ల ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు, చేర్పులకు అవకాశం
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
జిల్లాలోని అర్హులైన వారందరూ నూతన రేషన్ కార్డు కోసం తమ సమీపంలోని మీ సేవల సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపునకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అధికారులు విచారణ చేసి కార్డులు జారీ చేస్తారని, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతారని తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.