శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన అంగన్వాడీ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీలకు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, వాలంటరీ రిటైర్మెంట్ వాళ్లకి కూడా బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరుతూ మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లభారతి నేతృత్వంలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.వారి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ 1975 లో ఐసిడిఎస్ ప్రారంభమైనప్పటి నుండి సుదీర్ఘ కాలం గా సేవలు అందించి రిటైర్ అవుతున్న అంగన్వాడీ టీచర్స్ కు లక్ష రూపాయలు, ఆయాలకు 50 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడంపై టీచర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో ఇన్నాళ్లు సేవలందించి వృద్ధాప్యంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడవలసి వస్తుందని ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి వేతనంలో సగం పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉద్యోగానికి రాజీనామా చేసిన కూడా బెనిఫిట్స్ కల్పించాలని కోరడం జరిగిందన్నారు.రాష్ట్రంలో అన్ని అంగన్వాడి కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా నడపాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, జనాభా ప్రాతిపదికన అదనపు టీచర్లను నియమించాలని,పెండింగ్ ఏరియర్స్, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించినట్లు భారతి వివరించారు.అనంతరం కమిషనర్ క్రాంతి వెస్లీని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి వేదవతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర నాయకులు రమాతార, ఎల్లమ్మ, శిరీష, రాధ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *