రాహుల్ గాంధీ తో సమావేశమైన సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు
గంటపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు
చర్చల్లో పాల్గొని రాహుల్ గాంధీకి వినతి పత్రం అందజేసిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు హామీ
రాబోయే అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సముచిత అవకాశాలు కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-

దేశ రాజధాని న్యూఢిల్లీ లో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రాహుల్ గాంధీ తో సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమై దాదాపు గంట పది నిమిషాల పాటు చర్చించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న భగీరథుని వారసులు వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలువబడే సగర (ఉప్పర) ల ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆల్ ఇండియా సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి ఓంప్రకాష్ మహతో ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 11 మంది ప్రతినిధులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలో సాల్ట్ మేకర్స్ పరిధిలోకి వచ్చే సగర ఉప్పరుల స్థితిగతులపై చర్చించడం జరిగింది. సగరులు అన్ని రంగాలలో ముందడుగు వేసే క్రమంలో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే పార్లమెంటులో సమస్యలను లేవనెత్తుతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాబోయే అన్ని ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఉన్న సగరులకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో సగరులను బిసి ‘డి’ నుంచి ‘ఏ’ లోకి మార్చాలని, ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి నిధులు కేటాయించాలని, 59 జీవో ను సవరణ చేసి సగరులకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ పదవి సగరులకు ఇవ్వాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర రాహుల్ గాంధీ కి వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిస్తూ సగరుల న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సూచిస్తానని హామీ ఇచ్చారు.