Encroachment Allegations on Government Land in RK Pur
ఆర్కేపి లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు….
భూమి కాజేసింది వ్యాపారస్తుడు….టేలాలో కిరాయికి దివ్యాంగుడు….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూములను రక్షించే ప్రయత్నం కూడా చేయడం లేదని పుర ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పేదవారు చిన్న పూరి గుడిసె వేసుకుంటే నానా హంగామా చేసే మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు వ్యాపారస్తులు, బడా లీడర్లు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ప్రాంతం నుండి ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో గల ఓ మద్యం దుకాణం వద్ద ఓ వ్యాపారస్తుడు సర్వే నెంబర్ ఏడు లోని ప్రభుత్వ భూమిలో టేలా వేయడమే కాకుండా అట్టి టేలను ఒక దివ్యంగుడికి కిరాయికి ఇచ్చినా సరే సంబంధిత అధికారులు టేలా పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు.అట్టి టేలను శాశ్వతంగా అమర్చి దాని ముందు ప్రాంతం కాంక్రీట్ తో చదును చేస్తున్నా సరే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పుర ప్రముఖులు అంటున్నారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటే సంబంధిత అధికారులు “మామూలు”గా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది రక్షించాలని ప్రాంత ప్రజల కోరుతున్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు…

మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అట్టి ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అన్ని హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సర్వే నెంబర్ 7 లో గల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లయితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ చౌక్ నుండి ఏరియా హాస్పిటల్ వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కనగుర్తు తెలియని వ్యక్తులు టేలా వేసుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అది ప్రభుత్వ భూమి అని తేలితే తొలగిస్తామని తెలిపారు.
అట్టి భూమి ప్రభుత్వ ఆధీనంలోకే వస్తుంది…
20వ వార్డు బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ రావు.

20వ వార్డులోని ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో స్థానిక వైన్స్ షాపు పక్కన గల ప్రదేశం ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని, అట్టి ప్రదేశం లో గుర్తుతెలియని వ్యక్తులు టేలా వేసి దానిని కిరాయికి ఇచ్చినట్లు మా దృష్టికి వచ్చిందని, త్వరలోనే సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన రహదారి స్థలాన్ని కబ్జా చేయడం మరి విడ్డూరంగా ఉందని అన్నారు.
