కూడికలో పోచంపల్లి! తీసివేతలో ముత్తిరెడ్డి!?

ముత్తిరెడ్డికి మూడో సారి టిక్కెట్టు లేనట్లే?

రసకందాయం లో జనగాం రాజకీయం!

నాయకులు సంతృప్తిగా లేరు?

కార్యకర్తలు సంతోషంగా లేరు?

ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు?

కొత్త నాయకత్వంతో టిఆర్‌ఎస్‌ కు తిరుగులేదంటున్నారు?

ఈసారి ముత్తిరెడ్డి ముఖం చూసే ముచ్చటే లేదంటున్నారు?

ముత్తిరెడ్డి కబ్జాలతో జనం లబోదిబోమంటున్నారు?

పోచంపల్లిని జనగామ బరిలో దించాలంటున్నారు?

రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు పక్కాగా వుంటాయి. రాజకీయాల్లో మనుషులు తలకిందులైనా, సరే లెక్కలు ఖచ్చితంగా వుండాలంటారు. కూడాల్సిన చోట కూర్చకుండా, తీసేయాల్సిన చోట తొలగించకుండా వుంటే లెక్కలు తారుమారౌతాయి. అంకెలు ఆగమౌతాయి. సీట్లు గల్లంతౌతాయి. అనుకున్న సమయంలో అనుకున్నట్లు మేలుకోకపోతే మేలుకొలుపు లేకుండాపోతుంది. ప్రపంచమంతా నిద్రావస్ధలో వున్నా, రాజకీయ నాయకుడు కళ్లు తెరిచే నిద్ర నటిస్తాడని సామెత. అందుకే టిఆర్‌ఎస్‌లో ఎవరు ఏకులు, ఎవరు ఏకు మేకులు, ఎవరు అధికులు, ఎవరు లోకులు అన్నది తేలాల్సిన సమయం ఆసన్నమైంది. గత ఎన్నికల్లోనే చాలా మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. కాకపోతే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న నమ్మకంతో ఎమ్మెల్యేలపై వారి అభిప్రాయాలను జనం రుద్దలేదు. అరవై ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ సీమాంధ్రుల చేతిలోకిపోతే మళ్లీ కథ మొదటికొస్తుందని అనుకున్నారు. తెలంగాణలను కాపాడాలంటే మళ్లీ కేసిఆర్‌కే కావాలనుకున్నారు. కేసిఆర్‌ను చూసి మాత్రమే జనం ఓట్లేశారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రసైన ఎమ్మెల్యేలను కూడా మళ్లీ గెలిపించారు. అలాంటి నియోజకవర్గాలలో జనగామ ఒకటి.

అది జనగామ. జైనులు నడయాడిన నేల. వీరులగన్న గడ్డ. పోరాటాల పురిడిగడ్డ. 

రైతాంగ సాయుదపోరాటానికి ఊపిరులూదిన నేల. తెలంగాణ చరిత్రలో జనగామ లేని పేజీ లేదు. పూర్వం జైనులు, తర్వాత శాతవాహనులు, కాకతీయులు, మొగలులను సైతం ఎదిరించిన సర్ధార్‌ సర్యాయిపాపన్న, తెలంగాణ సాయుధ పోరాటం, ముగింపు, మలి దశ తెలంగాణ ఇలా అంతా జనగాంలోనే…అన్నింట్లో జనగామే..అలాంటి జనగామ రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. నూరు శాతం అక్షరాస్యత ముప్పై ఏళ్ల క్రితమే అనేక గ్రామాలు సాధించిన జిల్లా. తెలంగాణ తొలి, మలి దశల తెలంగాణలకు కీలకమైంది. ఎంతో మంది త్యాగధనులకు నెలవైంది. అలాంటి జనగామలో రాజకీయాలు ఎంత గంభీరంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. ఇంత వరకు బాగానే వుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఇష్టారాజ్యం మొదలైందనే మాటలే ఆనాటి నుంచి నేటికీ వినిపిస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో వున్న చెరువు కబ్జా ఆరోపణలతో ఆయన వివాదాలకు మొదలయ్యాయి. జనగామ జిల్లా తొలి కలెక్టర్‌ ఈ విషయంలో ఎమ్మెల్యే తీరును నిరసించిన సందర్భం వుంది. నివేదిక కూడా సమర్పణ జరిగింది. ఎమ్యెల్యే చెరువు కబ్జా విషయం ఆమె భహిరంగంగానే వెల్లడిరచింది. కాకపోతే ఆమె బదిలీ అయ్యింది. అయినంత మాత్రాన ఆయన కబ్జా భాగోతం కనుమరుగు కాలేదు. జనగామలో కొత్తగా నిర్మాణం జరిగిన దుర్గమ్మగుడి స్ధల రిజిస్ట్రేషన్‌ సంగతి సరే సరి…ఇక చేర్యాల చెరువు శిఖం వివాదాం ఇంకా సాగుతున్నదే. 

                      పోలీసులను కాపలా పెట్టి మరీ చేర్యాలలో రాత్రికి రాత్రి ప్రహారి నిర్మాణం భహిరంగ రహస్యమే…

ఇక దెయ్యాల పేరిట ఓ గ్రామంలో ఊరు ఖాళీ అయిన సంగతి తెలిసిందే..దాని వెనుక ఎమ్మెల్యే వున్నట్లు వచ్చిన ఆరోపణలు అలాగే వున్నాయి. నర్మెట్ట మండలంలో ఆయన పామ్‌హౌజ్‌ వివాదం, రోడ్డును సైతం కబ్జా వైనం అందరూ చెప్పుకుంటున్నదే. ఒక ఎమ్మెల్యే అయి వుండి, పట్టణ పర్యటన పేరుతో ఉదయం వేళ షాట్‌ వేసుకొని తిరడాన్ని అప్పటి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే…ఇక గత ఎన్నికల సమయంలో ఓ మహిళా వీర్వోను ఇంటికి పిలిపించుకొని బెదిరించడం, తర్వాత క్షమాపణ చెప్పడం జరిగిందే…జనగామ జిల్లాలో ఏ తెరాస నాయకుడు కూడా ఆయనన గురించి పాజిటివ్‌గా మాట్లాడే సందర్భమే లేకుండా చేసుకున్నారని అంటున్నారు. గత ఎన్నికల మందు కూడా బచ్చన్న పేట మండలానికి చెందిన మహిళలపై కేసులు నమోదు చేయడాన్ని కూడా ప్రజలు తీవ్రంగా ఖండిరచారు. ఇక ఓట్లేయలేదని కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వనని ఎమ్మెల్యే తెగేసి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చిన సందర్భాలు చూశాం? హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలో ఆయనపై వున్న కబ్జాల గురించి వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. ఇక అత్యంత వివాదాస్పదమైన విషయం గురించి చెప్పుకోవాల్సి వస్తే, కొమురవెళ్లి మల్లన్న గుడి వివాదం. ఎమ్మెల్యే ఏకంగా కొత్త విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ప్రజలనుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చీవాట్లు పెట్టడంతో ఆ వివాదం అక్కడితో సర్ధుమణిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వివాదాలు లేకుండా ఏ ఒక్క రోజులేదు. ఆయనకు వ్యతిరేక వర్గమంటూ లేని ఊరు ఒక్కటీ లేదని నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా ముత్తిరెడ్డిని మార్చితే తప్ప, టిఆర్‌ఎస్‌ గెలవడం కష్టమే అని పార్టీ నేతలు మధనపడుతున్నారు. మళ్లీ ముత్తిరెడ్డి పేరు చెప్పిమేం ప్రచారం చేయలేమని, ఆయనపై వున్న ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మార్చలేమని అంటున్నారు. 

జనగామలో ఇప్పటికీ తెరాస ఎంతో బలంగా వుంది.

మిగతా పార్టీలకు ఉనికి కూడా పెద్దగా లేదు. ఆయా పార్టీలలో వున్న రాజకీయ సంక్షోభం మూలంగా ప్రజలకు ఆ పార్టీల మీద నమ్మకం కూడా లేదు. తెరాసలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదం తప్ప, మరేం లేదు. ప్రజలు మొత్తం టిఆర్‌ఎస్‌ వైపే వున్నారు. కాకపోతే పార్టీ ముత్తిరెడ్డిని కాకుండా, ఎవరిని నిలబెట్టినా మళ్లీ గుబాబీ జెండాదే రెపరెపలు అంటున్నారు. కారుకు ఎదురులేదు. ఇలాంటి సమయంలో జిల్లా నాయకుల్లో, కార్యకర్తలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకునే విధానం అందరినీ మెప్పించిందనే అంటున్నారు. ఈసారి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా శ్రీనివాస్‌ రెడ్డికి ఇస్తే జనగామలో కొన్ని దశాబ్దాల పాటు తెరాసకు తిరుగుండకపోవచ్చంటున్నారు. స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఆయన జిల్లా మొత్తం నాయకులతో, కార్యకర్తలతో సహా ఏర్పడిన సత్ససంబంధాలు కూడా ఇందుకు కారణమంటున్నారు. పైగా పార్టీపరమైన ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా, జిల్లా సమన్వయకర్తగా ఆయన సేవలకు నాయకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక జిల్లాలోని కొన్ని ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఆయన వ్యక్తిగతంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా అనేకం వున్నాయి. లింగాల ఘనపురం మండలంలోని జీడికల్‌ సీతారామాచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు కోటి రూపాయల వరకు వ్యక్తిగత వితరణ చేసినట్లు చెబతున్నారు. ఆలయ అభివృద్ధికోసం రూ.50 కోట్ల ప్రణాళికలు కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రతి ఎంపిటిసికి కూడా రూ.5లక్షల మేర అభివృద్ధి నిధులు అందించి, వారి చేత కూడా ప్రశంసలు పొందిన నేతగా కొనియాడబడుతున్నారు. జిల్లాలో ఏ ప్రాంత ప్రజలు ఆహ్వానించినా కాదనకుండా హజరౌతున్నారు. బచ్చన్న పేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆయన ఎంతో చేయూతందించినట్లు తెలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ది విషయంలో ఇప్పటికే రూ.కోటిన్నరకు పైగా అందజేసినట్లు సమాచారం. అంతే కుండా ఆలయ పరిసర ప్రాంతామంతా మార్పుల్‌ వేయడానికి అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా ప్రజల్లో వుంటూ, ప్రజలకు అందుబాటులో వుంటూ, జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి జనగామ టిక్కెట్‌ ఇస్తే మాత్రం టిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. పైగా ప్రతిపక్షాలలో వున్న లుకలుకలు కూడా బాగా కలిసి వస్తాయి. ఒక వేళ మళ్లీ ముత్తిరెడ్డికే టికెట్‌ ఇస్తే మాత్రం, కలహాల కాపురమైనా కాంగ్రెస్‌నే ప్రజలు ఆదరించే అవకాశం లేకపోలేదంటున్నారు. అందువల్ల ఆసారి ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్‌ కట్‌ అన్నది దాదాపుగా తేలిపోయినట్లే అంటున్నారు. పికే సర్వేలో కూడా ఇదే తెలినట్లు సమాచారం. ఏది ఏమైనా జనగామలో సరికొత్త రాజకీయాలు కొద్దిరోజుల్లో చూడడం ఖాయంగానే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *