కాలం కరిగిపోతోంది…కన్నీళ్లు ఇంకిపోతున్నాయి!

`తిరిగి, తిరిగి అలసిపోతున్నారు.

`విసిగి వేసారిపోతున్నారు.

`ఓపిక కూడగట్టుకొని ఇంకా తిరుగుతున్నారు.

`ఇంత కాలం తిరిగి, ఇప్పుడు వదిలేయలేక దుఖిస్తున్నారు.

`ఇప్పటికైనా కనికరించండి.

` కేటిఆర్‌ మాట ఇచ్చాడనే ఆశతో తిరుగుతున్నారు.

`కడియం శ్రీహరి మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

`ఉద్యోగ సంఘాల నాయకుల తప్పకుండా తమకు కొలువులిప్పిస్తారని విశ్వాసంతో వున్నారు.

`ప్రతిసారీ దేవి ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డి ల చొరవను పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటారు.

`ఎన్నటికైనా వాళ్లు దారి చూపిస్తారని చెప్పుకుంటుంటారు. 

`ఆ 51 మంది నిరంతరం తలుచుకుంటూనే వున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 వాళ్ల బాధ వర్ణనాతీం…ఎంత చెప్పినా తక్కువే…ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు…ఆరేళ్లగా అవస్ధలు పడుతున్నారు. కష్టాలు ఎదుర్కొంటున్నారు. కన్నీళ్లు దిగమింగుకొని బతుకుతున్నారు. అయినా బతుకులకు ఏదో ఒక రోజు దారి కనిపిస్తుందన్న ఆశతో సాగుతున్నారు. కనిపించిన నాయకుడికి సమస్యలు వివరించారు. ఎదురొచ్చిన నాయకుడికల్లా గోడు వినిపించుకున్నారు. గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. మొక్కులు మొక్కుకున్నారు. ఏ దేవుడు కరుణించడం లేదు. ఏ నాయకుడు వారిని పట్టించుకోవడం లేదు. అందరూ సాయం చేస్తామన్న వాళ్లే…కాలం కలిసి రావడం లేదు. వాళ్ల వ్యధలు తీరడం లేదు. పోయిన కొలువులు రావడం లేదు. అయినా నమ్మకం సడలడం లేదు. వారికి ఎక్కడో ఒక దగ్గర విశ్వాసం వుంది. ఎన్నటికైనా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వుంది. మాట ఇచ్చిన వాళ్లు చిన్న చిన్న నాయకులు కాదు. ఒకరు రాష్ట్ర మంత్రి కేటిఆర్‌. ఆయన మాట ఇచ్చాక ఎప్పటికైనా తమ జీవితాలు నిలబడతాయని కొండంత ఆశ. మరో నాయకుడు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఆది నుంచి గృహనిర్మాణ శాఖ నుంచి తొలగింపబడిన ఉద్యోగులకు సానుభూతి చూపిస్తూనే వున్నారు. వారికి సాయ పడుతూనే వున్నారు. అనేక ప్రయత్నాలు చేశారు. తొలుత వాళ్లు కడియం శ్రీహరిని కలిసినప్పుడు అప్పటి కలెక్టర్‌కు విషయం వివరించారు. ఆనాటి నుంచి ఒక దశలో అప్పాయింటు మెంట్లు వచ్చే దశకు చేరుకునేలా చేశాడు. వాళ్లకు కొలువులు వస్తున్నాయన్న శుభవార్త కూడా కడియం శ్రీహరి వాళ్లకు చెప్పారు. కాని ఎందుకో అర్థాంతరంగా ఆగిపోయాయి. 

 తిరిగీ తిరిగి 51 మంది ఉద్యోగులు ఎంతో అలసిపోయారు. 

వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కొలువులు ఎప్పుడో రావాల్సివుండేది. కాని అప్పటి మేయర్‌ చేసిన చిన్న పని మూలంగా వారి జీవితాలు మళ్లీ మొదటికొచ్చాయి. అక్కడి నుంచి కదలకుండా చేశాయి. నిజానికి ఈ 51 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పై స్ధాయి నుంచి కింది స్ధాయిదాకా సుముఖంగానే వున్నారు. ఇప్పటికీ అందరూ అయ్యో అనే అంటున్నారు. కాని ఆనాడు అప్పటి మేయర్‌ చేసిన పని మూలంగా వారి కష్టాలు ఇప్పటికీ తీరలేదు. కొలువులు రాలేదు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ కూడా ఎంతో పకడ్భందీగా చెప్పారు. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు చర్చకు తెచ్చి మరీ కేటిఆర్‌ మాట ఇచ్చారు. తొలగించబడిన ఉద్యోగులను తీసుకోవాలని ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కూడా తీర్మాణాలు జరిగాయి. మినట్స్‌లో పొందుపర్చడం జరిగింది. వారి పేర్లతో సహా ఉద్యోగ కల్పనపై పూర్తి స్పష్టత వుంది. కాని అప్పటి మేయర్‌ ఒక దశలో 450 మంది ఇతర ఉద్యోగులను తీసుకున్నాడు. వీళ్లకు ఆశపెట్టి మోసం చేశాడు. మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను కూడా బేఖాతరు చేశాడు. కాని ప్రతిసారి మభ్యపెడుతూ, బైట ఒకలా, నాలుగు గోడల మధ్య ఒకలా మాట్లాడుతూ వారి జీవితాలకు దశ, దిశ లేకుండా చేశాడన్నది ప్రధానంగా ఉద్యోగుల ఆరోపణ, ఆవేదన. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాకపోతే ఇవ్వాలన్న చిత్తశుద్దిని ఎవరూ ప్రదర్శించడం లేదు. వీరి విషయంలో కమీషనర్‌ ఈ ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే పెద్ద సమస్య అవుతుందని చెప్పినా నాయకులు వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. వారికి కొలువులు ఇవ్వలేదు. పైగా కొత్తగా కొంత మందిని తీసుకున్న సమయంలో కూడా వీరు ఎంత పట్టుబట్టినా కొలువులు రాలేదు. ఆఖరుకు సఫాయి కార్మికులుగా కూడ ఆపనిచేసేందుకు ముందుకొచ్చినా అధికారులు స్పందించలేదు. అప్పటి మేయర్‌ మనసు అసలే కరగలేదు. కనీసం మానవత్వం కూడా చూపలేకపోయారు. 

ఉద్యోగ సంఘాల నాయకులు చేసినంత కూడా రాజకీయ నాయకులు చేయలేకపోయారు. 

నిజానికి నాయకులు ఇలాంటి సమస్యలు పట్టించుకోవాలి. కాని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతో పట్టించుకున్నారు. దేవీ ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డిలు ఆ మాత్రం చొరవ చూపడం వల్లనే కనీసం వీళ్ల సమస్యలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కేటిఆర్‌ దృష్టికి వెళ్లింది. ఒక దశలో పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డిలు అనేక సార్లు వాళ్లను స్వయంగా హైదరాబాద్‌ కూడా తీసుకెళ్లేవారు. వాళ్ల కార్లలోనే తీసుకెళ్లి, మంచీ చెడులు చూసుకునేవారు. నిజానికి ఇవి చేయాల్సింది నాయకులు. కొందరు నాయకులు వీరికి ఉద్యోగాలు ఇస్తే మాకేం లాభం అన్న ఆలోచన చేశారు. మీకు ఎందుకు కొలువులియ్యాలి..రా…అన్నంత మాటలు కూడా మాట్లాడిన విషయాలు ఇప్పటికే నేటిధాత్రి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే… మాజీ మేయర్‌, డిప్యూటీ మేయర్లతోపాటు, కొంత మంది నేతలు వీళ్లకు కొలువులు రాకుండా అడ్డుపడ్డారన్న సంగతులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వారి స్వార్ధం కోసం ఈ 51 మంది జీవితాలలో ఆటలాడుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులైన దేవీ ప్రసాదర్‌, కారం రవీందర్‌ రెడ్డి, పరిటాల సుబ్బారావులు అంతగా పట్టించుకోవాల్సిన అసవరం లేదు. కాని వాళ్లు చూపిన జాలిలో నాయకులు పదో వంతు చూపినా ఇప్పటికే వీళ్లకు కొలువులు వచ్చాయి. 

అసలు వీళ్లపై కక్ష్య కొందరు నాయకులు ఎందుకు పెంచుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. 

వీళ్ల నుంచి నాయకులు ఏదో ఆశించారన్నది మాత్రం స్పష్టమౌతోంది. కాని వాళ్లకు పూట గడవడమే కష్టమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి వారి నుంచి ఏదో ఆశించడం కూడా అమానవీయం. అయినా కొందరు నాయకులకు అదేదీ పట్టడం లేనట్లు వుంది. వారు అనుకున్నది నెరవేరాలన్న ఆలోచనతోనే వున్నట్లు కనిపిస్తోంది. కాని వారి పరిస్ధితి మరీ దయనీయంగా వుంది. ఇలాంటి వారి నుంచి ఎలాంటివి ఆశించినా తప్పే అవుతుంది. అయినా ప్రజా సేవ కోసం వున్నామని నిత్యం చెప్పే నాయకులు వీరి జీవితాలకు వెలుగులిస్తే, మరింత పేరొస్తుంది. కాని పేరొస్తే ఏమొస్తుంది…అనుకునే నేతలు కూడా వరంగల్‌లో వున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇంత కాలం జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు అసలు గుట్టు విప్పి, వీళ్లకు అన్యాయం చేస్తున్నవారికి నచ్చజెప్పి, వారి జీవితాలకు ఒక దారి చూపాలని కోరుతున్నారు. అంతే కాదు కడియం శ్రీహరి లాంటి సీనియర్‌ నాయకుడు కూడా వీరికి ఏదో ఒకదారి చూపాలన్న ఆలోచనతోనే వున్నాడు. కాకపోతే ఆయన ప్రయత్నాలు కూడా కొందరు అడ్డుకున్నట్లు స్పష్టమౌతోంది. ఏది ఏమైనా ఈ ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టకండి అన్నది వారు కోరుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *