రిజిస్ట్రేషన్‌ శాఖలో భారీ ప్రక్షాళన.

 

 

ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నవారికి తప్పదని తేలిన స్థాన చలనం?

దశాబ్దాల కాలానికి పైగా లేని ట్రాన్స్‌ఫర్లు?

ముందే చెప్పిన నేటిధాత్రి!

నేటిధాత్రి వరుస కథనాలుతో కదలిక!

ప్రభుత్వం ఆలోచన ముందే పసిగట్టిన ఉద్యోగులు?

యూనియన్‌ కార్యకలాపాలకు కొత్త కమిటీ ఏర్పాటు?

రాయభారాలకు తెర తీత?

కదల్చకుండా వుండాలంటే ఎంత కావాలి! ఉద్యోగుల ఓపెన్‌ ఆఫర్లు?మంత్రుల స్థాయిలో బేరసారాలు?

కోట్లలో జరుగుతున్నట్లు సమాచారం? 

రంగారెడ్డి, మేడ్చల్‌ హట్‌ కేకులు?

నగర శివారు ప్రాంతాలను వదిలేందుకు ససేమిరా… అంటున్న సబ్‌ రిజిస్ట్రార్లు?

ముందైతే వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లు కానిద్దాం…అందిన కాడికి వెనకేద్దాం?

గుట్టు చప్పుడు కాకుండా మింగేద్దాం?

పరిచయం వున్న రియలర్లు, ప్రజా ప్రతినిధుల పనులు చకచకా?

గత నెల రోజులుగా సాగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై నేటిధాత్రి నజర్‌?

త్వరలో వాటి వివరాలు కూడా…?

దేనికైనా టైం రావాలి. కాలం, ఖర్మం కలిసి రావాలి. మంచికైనా, చెడుకైనా…! అన్నారు పెద్దలు. అదేంటో ఇక మేం ఇక్కడే…మేమంతా ఎక్కడి వాళ్లమక్కడే…ఇదంతే…మేమింతే..అన్నట్లుగా వున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కసారి అలజడి మొదలైంది. ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎక్కడినుంచి ఎక్కడికి పంపిస్తారో అన్న ఆందోళన మొదలైంది. గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంత దిగులు మొదలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే రిజిస్ట్రేషన్‌ శాఖ, జిల్లాల్లో పాతుకుపోయిన సబ్‌ రిజిస్ట్రార్లతోపాటు, సిబ్బందిలో కూడా ఒక్కసారిగా కుదుపు కళ్లముందు కనిపించేసరికి ఏం చేయాలో అర్ధం కాకుండా పోయింది. ఇంత దూరం వచ్చే దాక, తెచ్చేదాక నేటిధాత్రి నిద్రపోదని గతంలో తాటికాయంత అక్షరాలలో వార్తలు రాసింది. అయినా విన్నారా? చలించారా? లేదు…నేటిధాత్రి రాస్తే ఏమౌతుంది? ఎవరేమరి రాసుకుంటే ఏమౌతుంది? అన్నవారు కూడా గుడ్లు తేలేస్తున్నారు. అన్నంత పని అయిందని, అంత దూరం పరిస్ధితి వెళ్లిందని అనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వృధా అన్నది కొందరి వాదనైతే, ఎలాగైనా ప్రక్షాళన ఆపాలన్న ధోరణిలో కూడా ఇంకా కొందరున్నట్లు తెలుస్తోంది.

అందరం వేరు..మేం వేరు…అన్ని వ్యవస్ధలు వేరు..మేం వేరు…ఎవరు మారినా, ఏ పాలకులు వచ్చినా మేమింతే…మమ్మల్ని ముట్టుకోరంతే…ఎవరు మార్చాలని చూసినా, మారింది వాళ్లే కాని, మేం కాదు….అలా ఆలోచనలు చేసిన వారి అడుగులు ఏనాడు ముందుకు పడలేదు. మమ్మల్ని కదిలించే శక్తి ఎవరికీ లేదు? మేమే చెక్‌ మేట్స్‌…? మాకు చెక్‌ పెట్టేవారా? నెవర్‌…? మమల్ని కదిలించేంత ధైర్యం చేస్తారా? ఒక్కసారిగా వ్యవస్ధ అస్తవ్యస్తమైపోతుంది? ఎవరెన్ని చెప్పినా మాకు మేమే…మేమంతా ఏకు మేకులమే? మమ్మల్ని ముట్టుకుంటే అగ్గిమీద గుగ్గలమే…? ఇదంతా నిన్నటిదాక రిజిస్ట్రేషన్‌ శాఖలో కొందరి మాట…బీరాలు పలికిన వాళ్ల ఆట…ఇప్పుడు నోట రాని పూట….

ఇంత కాలం జరుగదు అనుకున్నది జరిగే సమయం ఆసన్నమౌతోంది. అసలు గ్రౌండ్‌ రియాల్టి తెలిసిపోతోంది. కాకపోతే ఏదో ఒకటి చేయాలి? ఎలాగైనా ప్రక్షాళనను అడ్డుకోవాలి. ట్రాన్స్‌ఫర్లు ఆపుకోవాలి…మాటలకు వినకపోవచ్చు….? అభ్యర్ధనలకు కరగకపోవచ్చు…బెదిరింపులకు అదరకపోవచ్చు…కాని నోట్లకు చలించని వాళ్లుంటారా? మంత్రులైనా డబ్బు వద్దంటారా? రిజిస్ట్రేషన్‌ శాఖలో సంపాదన మంత్రులకు తెలియందా? కోట్లు కొడతామంటే మంత్రులు పనిచేసి పెట్టరా? అని చర్చలు జోరుగా సాగుతున్నాయట? పై నుంచి ప్రక్షాళన అనుకుంటూ వచ్చే లోపు కింద నుంచి రాజకీయ భేరాలు మొదలు పెట్టుకుంటే సరిపోదా? ట్రాన్స్‌పర్లనను ఆపుకోలేమా? అనుకుంటున్నారట. ఇప్పుడు తంటంతా ఏళ్ల తరబడి ఆయా కార్యాలయాల్లో తిష్టవేసుకున్నవారికే ఎక్కడలేని బాధ ఏర్పడుతుంది. ఇక్కడంటే పదేళ్లగా పెరిగిన పరిచయాలు? సమకూరిన ఆదాయ మార్గాలు? అందరూ తెలిసిన రియల్టర్లు? ఎలా ముట్టజెప్పాలో వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? నాయకులందరూ తెలుసు? వారికి చేసి పెట్టిన పనులకు ఎప్పటికీ రుణపడి వుంటారు? మరి ఇంత మంది పరిచయస్తులతో కూడిన ఆదాయ సామ్రాజ్యం కూల్చుకోవడం అవసరమా? ఎంత ఖర్చైనా సరే పెట్టుకొని మళ్లీ ఇక్కడే తిష్టవేయలేమా? ఇదీ కొందరు సబ్‌ రిజిస్ట్రార్ల ఆంతరంగిక సమావేశాల్లో సాగుతున్న చర్చ? అని తెలుస్తోంది. 

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమీషనర్‌ను సడెన్‌గా మార్చినప్పుడే శాఖలో ఏదో జరిగే అవకాశం వుందని కొందరు పసిగట్టారు. కాకపోతే ఎక్కడా ఏ చలనం కనిపించడం లేదని కొందరు పనితోపాటు, ఆదాయ సముపార్జనలో మునిగిపోయారు. యాధావిధిగా సంపాదన వెనకేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా ప్రక్షాళన తప్పేలా లేదన్న విషయం చెవిలో పడేసరికి అలజడి మొదలైంది. మూసుకుపోనున్న దారులను ఎలా తెరిపించాలన్న దానిపై దృష్టిపెడుతున్నారు. ఈ సమయంలో అందరికీ కనిపించిన సర్వరోగ నివారణి…మంత్రులతో పరిచయాలు..వారికి కొందరు సబ్‌ రిజిస్ట్రార్‌ల విన్నపాలు…మొదలయ్యాయి? ఏకంగా మంత్రులతోనే నేరుగా బేరసారాలకు దిగినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాదు …మంత్రులను ఏం కావాలని కాకుండా, ఎంత కావాలో చెప్పండన్నంత ఓపెన్‌ ఆఫర్‌ చేస్తున్నారట? అంటే ఏ రేంజ్‌లో ఆ శాఖలో సంపాదన పోగేసి పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. మంత్రులతో ప్రత్యేకంగా అప్పాయింటు మెంట్లు తీసుకుంటూ, మాకు స్ధానం చలనం లేకండా చూస్తే సరి…సిఎస్‌తో ఒక్క మాట చెప్పితే సరి…? మేం కుర్చీ కదలకుండా చూసుకుంటే సరి…అంటూ ముక్తసరితోనే కోట్లు ముందు పెట్టడానికి కూడా వెనకాడేది లేదని అంటున్నారట? ఇలాంటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో టాప్‌లో వున్నాయన్న మాట తెలిసిందే…? ఆ కార్యాలయాలు హాట్‌ కేకులు? వాటిని వదులుకునేందుకు ఉద్యోగులు ఇష్టపడడం లేదు? ఎలాగైనా ట్రాన్స్‌ఫర్లు ఆపాలన్నదానిపై దృష్టిపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివారులో జరిగే భూ క్రయవిక్రయాల్లో వచ్చే సంపాదన అంతా ఇంతా కాదు? దాచుకోలేనంత? లెక్కబెట్టుకోలేనంత? కోట్లలో వుండే ఆదాయాన్ని వదులుకొని, మారు మూల జిల్లాలకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడడంలేదట? 

ఇదిలా వుంటే ఇంత కాలం స్ధబ్ధుగా వున్న యూనియన్‌ కార్యకలాపాలపై కూడా ఉద్యోగులు దృష్టిపెట్టినట్లు కూడా తెలుస్తోంది. గత కొన్నెళ్లుగా ఎలాంటి ఆడంబారాలులేని యూనియన్‌ కార్యకలాపాలను తెరమీదకు తెచ్చారట. ఎన్నికలను కూడా ఆగమేఘాల మీద నిర్వహించుకున్నారు? ముందు చెప్పిన పనులన్నీ, రాయభారాలు నడిపేందుకు అవసరమైన శక్తియుక్తులున్నవారికి పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది? ప్లాన్‌ ఏ ఫెయిల్‌ అయితే ఫ్లాన్‌ బీ…అన్నట్లు అవసరమైతే యూనియన్‌ను కూడా అడ్డం పెట్టుకొని తమ ట్రాన్స్‌ఫర్లు ఆపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారట? ఉద్యోగమన్నాక, ట్రాన్స్‌ఫర్‌ తప్పని సరి…కాని మాకు మాత్రం వద్దన్నంత దోరణిలో సాగుతున్నవారి లిస్టుకూడా శాఖపెద్దలు తయారు చేసినట్లు సమాచారం. అంతే కాదు శాఖలో ఎవరెవరు? ఎక్కడున్నారు? ఎంత కాలం నుంచి ఒకే చోట వున్నారు? వారిపై వున్న విమర్శలెమిటి? ఆరోపణలేమిటి? పట్టుబడిన సందర్భాలేమిటి? అవినీతి కార్యాకలాపాలేమిటి? అన్న వాటిపై శాఖలో పూర్తి స్ధాయి కసరత్తు మాత్రం జరగుతోంది. 

ఈ విషయం ముందునుంచే నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది. రాష్ట్రంలోని జిల్లాల వారిగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అనేక రకాలైన అవినీతి తంతును కొన్ని రోజులుగా వరస కధనాలు ప్రచురించింది. అయినా కొందరిలో చలనం రాలేదు. పైగా నేటిధాత్రి మీద నిందలు వేయాలని చూశారు. కేసులు నమోదు దాకా వెళ్లారు. కాని ఆఖరుకు వాళ్లే ఎలాంటి నిందలు మోస్తున్నారో కూడా చూస్తున్నారు. పైగా వారి అక్రమాలపై మాట్లాడిన వారిపై భౌతిక దాడులు చేసేంత దాకా ఎలా ఎదిగారన్నది? క్రిమినల్‌ చర్యల దాకా ఎలా వెళ్లారన్నదానిపై కూడా అనేక కథనాలు నేటిధాత్రి ప్రచురించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జరిగిన అనేక రిజిస్ట్రేషన్లపై కూడా సమగ్రమైన కథనాలు అందించింది. ఇలా నేటిధాత్రి చేసిన అలుపెరగని అక్షర పోరాటానికి త్వరలో ఫలితాలు రానున్నాయి. ఇదిలా వుంటే ఎలాగూ తమ తబాదలా తప్పదనుకునే దశలో వున్నవాళ్లు ముందూ, వెనక ఆలోచించుకుండా చేయాల్సిన అక్రమ రిజిస్ట్రేషన్లు అనేకం చేస్తున్నట్లు కూడా నేటిధాత్రి నిఘాలో వెలుగు చూస్తున్నాయి. ఈ నెలలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై త్వరలో సమగ్ర కథనాలు కూడా ప్రచురించడం జరుగుతుంది. ప్రజలకు మేలు చేయాల్సిన కుర్చీలో కూర్చున్నవారు స్వార్ధపరులై, అక్రమార్కులకు కొమ్ము కాస్తే, నేటిధాత్రి వదిలిపెట్టదు. అన్యాయాలను చూస్తూ ఊరుకోదు. అక్రమాలను వెలుగులోకి తేకుండా వుండలేదు. అదే మా నిబద్దత…అక్షర యజ్ఞత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *