మా గోడు…

వాళ్లు అకారణంగా,అన్యాయంగా ఉద్యోగాలనుంచి తొలగించబడిన హోంగార్డులు… కష్టేఫలి అనుకున్నారు..కష్టపడి పనిచేశారు.


రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…

 


అన్ని రకాల అర్హతలతోనే ఎంపికయ్యారు. కొలువులు సంపాదించుకున్నారు. ఇష్టంగా విధులు నిర్వర్తించారు.

ఉద్యోగ నిర్వహణలో ఏనాడు పొరపాట్లు చేయలేదు. తప్పులు దొర్లలేదు. అజాగ్త్రతలు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. వివాదాలు లేవు. విమర్శలు లేవు. అంతగా వృత్తిని ధర్మంగా భావించి పని చేశారు. ఉద్యోగాన్ని పవిత్రంగా భావించారు. జీవితం నిలబడుతుందని ఆశించారు. బతుకు బాగుపడుతుందనుకున్నారు. భవిష్యత్తు మీద ఎన్నో కలలుగన్నారు. మరింత ఉన్నత స్ధితికి వెళ్తామన్న ఆశతో త్రికరణశుద్ధితో పనిచేశారు. సెలవులు లేకున్నా సర్ధుకుపోయారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా వుంటూ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తిండి తిప్పలు లేకున్నా పనిచేశారు. కంటిమీద కునుకులేని రోజులు కూడా వున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రులైనా పనిచేశారు. ఎండననక, వాననక కర్తవ్యనిర్వహణగావించారు. అనేక సార్లు అనారోగ్యాల పాలయ్యారు.

అయినా ఉద్యోగాన్ని నమ్ముకుంటూ బతికారు. కాని కాలం కాటేసినట్లు గత పాలకులు వాడుకున్నన్ని రోజులు వాడుకొని కూరలో కరివేపాకులా తీసేశారు. అంతే కాదు ఆ సమయంలో సీమాంధ్రకు చెందని వాళ్లనెవరినీ తొలగించకుండా, కక్ష్య కట్టినట్లు తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారు. నాటి నుంచి తొలగించబడిన హోంగార్డులు పడుతున్న అసవస్ధలు అన్నీ ఇన్నీ కాదు. బతుకులు వీధినపడ్డాయి. మళ్లీ హోంగార్డు ఉద్యోగాలొస్తాయన్న నమ్మకంతోపాటు, పదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన కొలువులు తిరిగొస్తాయన్న విశ్వాసం. ప్రైవేటు సంస్ధలలో కూడా ఇలా అర్ధాంతరంగా తొలగించే పరిస్ధితి వుండదు. కాని నాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హోం గార్డుల జీవితాల్లో మట్టి కొట్టింది. దాంతో క్షోభ పడుతూ తనువు చాలించిన హోంగార్డులున్నారు. తిరిగి తిరిగి ఉద్యోగాలొస్తాయన్న నమ్మకంతో ఇంకా వారు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. సగం కడుపు కట్టుకొని, కూలీ నాలీ చేసుకుంటున్నవారు కూడా వున్నారు. కొందరు రకరకాలు వృత్తులను చూసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాని ఉద్యోగాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ హోంగార్డులకు జరిగిన అన్యాయం తెలిసింది. ఎలాగైనా వారికి న్యాయం జరగాలని కూడా అన్నారు. వారికి ఉద్యోగ కల్పన జరగాలని చెప్పారు. అయితే యంత్రాంగంలో కదలిక లేకుండాపోయింది. ఈ మధ్యే హోంగార్డులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కలిశారు. ఉద్యోగాలు పోయినప్పటినుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తరుచూ కలుస్తూనే వున్నారు. ఆయన కూడా వీళ్లకు న్యాయం చేయడానికి కృషిచేస్తూనే వున్నారు. కాని కాలం కలిసి రావడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ వినోద్‌కుమార్‌ను కలిశారు. వారి గోడు వినిపించారు. విద్యుత్‌శాఖ మంత్రిని కూడా కలిశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా వీరికి అసరాగానే వుంటూ వస్తున్నారు. ఈ మధ్య వీరి గురించి కదలిక వచ్చినట్లు కనిపించింది. హోంమంత్రి మహమూద్‌ అలీని కూడా హోంగార్డులు కలిసి తమ గోడు వినిపించుకున్నారు. వారు ఎంతో బాధలోవున్నారు. ఈ మధ్యే ప్రభుత్వం పెద్దఎత్తున కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకటించింది. అన్ని వేల మందిని ఏక కాలంలో రిక్రూట్‌ చేసే సమయంలో బాధితులుగా మిగిలిపోతున్న ఈ హోంగార్డుల జీవితాలను కూడా నిలబెట్టాలని కోరుతున్నారు. అకారణంగా, అన్యాయంగా తెలంగాణ ఉద్యోగులమైన కారణంగా తొలగించబడిన హోంగార్డులను ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పధంతో విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.