అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని…

నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం చేశారు. మహబూబబాద్‌ వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్‌ పనుల్లో నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారు. లోన లొటారం…పైన పటారం అన్న చందంగా డివైడర్‌ పనుల రౌతు గోడలను, ఇసుక సిమెంట్‌తో కడుతూ కాంక్రీట్‌ పనులను మాత్రం కంకర డస్ట్‌తో పనులను నిర్వహిస్తున్నారు. ప్లాంట్‌లో తీసుకుంటాడు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేటను స్మార్ట్‌ సిటీగా చేయడానికి స్థానిక శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి గత పాలనలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివద్ధి పనులను ప్రారంభించారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ సంపాదనే ద్యేయంగా నాసిరకంగా పనులు చేపడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం నర్సంపేట పట్టణానికి చెందిన కొందరు ప్రజలు ‘నేటిధాత్రి’ ప్రతినిధితో తెలుపగా నిర్మాణ పనులను పరిశీలన చేయగా నాసిరకంగా పనులు చేస్తున్నారని తేలిపోయింది. 20ఎంఎం కంకరకు బదులుగా 40ఎంఎం కంకరను వాడుతున్నారు. ఇసుక, కంకర, సిమెంట్‌తో చేయాల్సిన కాంక్రీట్‌ పనులను ఇసుకకు బదులుగా కంకర డస్ట్‌ వాడుతున్నట్లు, పని నిర్వహించే సూపర్‌వైజర్‌ ధనుంజయ అలాగే కార్మికులు తెలిపారు. డస్ట్‌ వాడకూడదు కదా అని అడగగా సంబంధిత శాఖ, అలాగే కాంట్రాక్టర్లు ఇసుకకు బదులుగా డస్ట్‌ను మాత్రమే వాడాలని చెప్పినట్లు వారు వివరించారు. నిర్మాణ పనుల వద్ద నుండి మున్సిపల్‌ ఏఈ సతీష్‌కు ఫోన్‌లో మాట్లాడగా వెంటనే స్పందించిన ఆయన నిర్మాణ పనుల వద్దకు వచ్చి పరిశీలించారు. నాసిరకంగా రోడ్డు డివైడర్‌ పనులను నిర్వహిస్తున్నారని పరిశీలనలో తేలిపోయింది. పనుల్లో ఇసుకను మాత్రమే వాడాలని, కంకర డస్ట్‌ వాడితే డివైడర్లను కూల్చివేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *