Trump Back in Nobel Peace Race
నోబెల్ రేసులో మళ్లీ ట్రంప్
ప్రపంచ శాంతిని స్థాపించడంలో తనను మించిన వారు లేరని ట్రంప్ బలమైన నమ్మకం. మిగతా అందరూ మాత్రం ప్రపంచానికి శాంతి లేకుండా చేశారని పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. నోబెల్ శాంతి బహుమతి సాధించాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల. అందుకే యుద్ధాలు ఆపుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి 2026 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం ట్రంప్ పేరు నామినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మొత్తం 287 నామినేషన్లు అందగా, అందులో ట్రంప్ పేరు ప్రముఖంగా ఉందని చెబుతున్నారు.
ప్రపంచం ప్రస్తుతం యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలుకొని పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వరకు.. ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని పక్కన పెట్టి, ప్రపంచ శాంతి కోసం అడుగులు వేయడం ద్వారా నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించవచ్చు. గతేడాది 2025లో వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ఈ బహుమతి దక్కడంతో, ఈసారి ఎలాగైనా దానిని కైవసం చేసుకోవాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్‌కు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ . ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధాలను ఆపి, సాధారణ స్థితిని పునరుద్ధరించగలిగితే ఆయనకు నోబెల్ దక్కడం ఖాయం . ఆ యుద్ధాలు ఎవరో చేస్తున్నవి కావు. ఇరాన్ పై ఆయన చేస్తున్న యుద్ధం ఆపేసి.. ప్రపంచాన్ని శాంతి వైపు మళ్లిస్తే చాలు. ఇప్పటికే ఇరాన్ పై చేస్తున్న దాడుల వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. చమురు ధరలు పెరిగిపోయి అనేక దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఇరాన్ పై యుద్ధం కాదు.. ప్రపంచంపై యుద్ధం. దాన్ని ఆపితే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి గ్యారంటీ.
