అప్పుడు చారి కుంపటి..ఇప్పుడు కొడుకు కిరికిరి!?

https://epaper.netidhatri.com/

 

`బిఆర్‌ఎస్‌ లో సిరికొండ ప్రశాంత్‌ కొత్త పంచాయతి?

`బిఆర్‌ఎస్‌ శ్రేణుల ఉక్కిరిబిక్కిరి!?

`భూపాలపల్లిలో స్వపక్షమే ప్రతిపక్షం మాదిరి!

`బిఫామ్‌ నాదే అంటూ ప్రశాంత్‌ చెప్పుకుంటున్న వార్తిది!

`కుమారుడు నా మాట వినడం లేదని మధుసూధనా చారి సంజాయిషీ!

`అటు కొడుకును ఎగదోసి!

 

`నాకేం తెలియదన్నట్లు నటిస్తూ వుండి!

`క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ చెబుతున్న మాటిది!

`సిరికొండ ప్రశాంత్‌ పార్టీ వ్యతిరేక వైఖరి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భూపాల పల్లి బిఆర్‌ఎస్‌లో మళ్లీ కుంపట్లు రాజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాలు సాక్ష్యాత్తు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌కుమారుడే ఉల్లంఘిస్తున్నాడు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించింది. అందులో ఏ మార్పు వుండదని కూడా పార్టీ ప్రకటన చేస్తూనే వుంది. అందులో భాగంగా భూపాల పల్లి నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కేటాయించారు. ఎమ్మెల్యే గండ్రకు సహకరించి, పార్టీ గెలుపుకు కృషి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ మధుసూదనాచారి మీద వుంది. కాని మాజీస్పీకర్‌ మధుసూధనా చారి కుమారుడు ప్రశాంత్‌ భిఫామ్‌ నాదే అంటూ కొత్త ప్రచారానికి తెరలేపుతున్నాడు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌లో నేతలు కొందరు కట్టుదాటుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో వుంటూ కూడా కట్టుదాటడం అంటే ఒకరకంగా క్షమించరాని తప్పు. పార్టీలో ఎవరైనా తప్పు చేసినా, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యంగా ఎవరు పనిచేసినా వారిని దారిలో పెట్టాల్సిన స్ధానంలో వున్నవారే తప్పు చేస్తే ఉపేక్షించకూడదు. పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ కుమారుడే పార్టీకి నలతగా మారితే పార్టీ పెద్దల దాకా సమస్య చేకపోవడంతో పార్టీ శ్రేణులు అమోమయంలో పడిపోతున్నారు. ఏ నాయకుడి పక్షాన నిలవాలో తేల్చుకోలేకపోతున్నారు. పార్టీలో గ్రూపులను చూసి తిట్టుకుంటున్నారు. నాయకులే ఇలా విడిపోయి రాజకీయాలు చేస్తుంటే, పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి బిఆర్‌ఎస్‌ రాజకీయాన్ని సిరికొండ మధుసూధనా చారి కుమారుడే కలుషితం చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. . పార్టీలో కార్యకర్తల మధ్య చీలిక తెస్తున్నాడు. అభ్యర్ధి ప్రకటన జరిగిన తర్వాత కూడా అనవసర రాజకీయం చేస్తున్నాడు. నాదే టికెట్‌ అంటూ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాడు. ఇది భూపాలపల్లి బిఆర్‌ఎస్‌లో ప్రధానంగా వినిపిస్తున్న మాట.
గత ఎన్నికల్లో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి మీద గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు.
అనంతరం గండ్ర బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇది మధుసూధనా చారికి నచ్చలేదు. దాంతో ఆది నుంచి భూపాల పల్లిలో ఏదో ఒక కిరికిరి పెడుతూనే వస్తున్నాడు. అయితే మధుసూధనా చారి పార్టీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మధుసూధనా చారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. భూపాల పల్లి రాజకీయాల్లో ఇక వేలు పెట్టొదని సూచించాడు. ఒక రకంగా ఆదేశించారు. అయినా మధుసూధనా చారి తన కిరికిరి రాజకీయం వదిలిపెట్టలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బల ప్రదర్శన మొదలుపెట్టాడు. ఎన్నికల్లో టికెట్‌ నాదే అంటూ ప్రచారం కూడా సాగించాడు. పార్టీలో కుంపటి రాజేశాడు. నిత్యం భూపాల పల్లిలో మధుసూధనా చారి వర్గం ఎమ్మెల్యేను అబాసు పాలు చేసేందుకు వెనుకాడలేదు. వైరి శిబిరాలువెలిశాయి. ఎమ్మెల్యేకు అడుగడుగునా మధుసూధనా చారి అడ్డుపుల్లలు వేస్తూ వచ్చాడు. దాంతో అభ్యర్ధుల ప్రకటనకు ముందే బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు భూపాల పల్లి పర్యటనలో అభ్యర్ధి గండ్రనే అని ప్రకటించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ మధుసూధనా చారిని పిలిచి, బలంగా వున్న చోట పార్టీని బలహీనపర్చొద్దని సూచించడం కూడా జరిగింది. గండ్రకు సహకరించాలని ఆదేశించడం జరిగింది. ఇంతలో అభ్యర్ధుల ప్రకటన కూడ జరిగిపోయింది.
గండ్ర వెంకటరమణారెడ్డి వల్లనే ఓడిపోయానని ఎలాగైనా ఆయనమీద పై చేయి సాధించాలన్నది మధుసూధనా చారి పంతంగా కనిపించింది.
ఎలాగైనా గండ్రకు టికెట్‌ రాకుండా చేయాలనుకున్నాడు. కాని కుదరలేదు. మధుసూధనా చారి ప్రజల చేత ఓడిరపబడ్డాడు. ఎప్పుడో తెలుగుదేశం హయాంలో ఓసారి గెలిచిన మధుసూధనా చారి, రెండు దశాబ్ధాల తర్వాత 2014 గెలిచారు. తెలంగాణ తొలి స్పీకర్‌గా బాధ్యతల నిర్వహించారు. అంత పెద్ద పదవి నిర్వహించి కూడా ఆయన 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే ప్రజలు ఆశించినంత సేవ మధుసూధనా చారి చేయలేన్నట్లే కదా? ఒక వేళ మధుసూధనా చారి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మెరగైన ప్రజా సేవ చేస్తే ఆ ఎన్నికల్లోనే గండ్ర గెలిచేవారు కాదు. మధుసూధనా చారి కన్న గండ్ర వెంకటరమణారెడ్డే మేలని ప్రజలు భావించారు. ప్రజాక్షేత్రంలో గండ్ర గెలిచారు. ఇది జీర్ణించుకోలేక, ప్రజా తీర్పును మధుసూధనా చారి గౌరవించలేకపోతున్నారు. నిజంగా మధుసూధనా చారి ప్రజలకు మర్చిపోలేని పనులు చేస్తే ఓటమిపాలయ్యే అవకాశమే లేదు. కాని ఓడిపోయారు. అయినా పార్టీ ఆయనకు సముచిత స్ధానం కల్పించింది. కొన్ని సార్లు ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా, పార్టీ గుర్తింపు దక్కుతుంది. అదే ఇక్కడ మధుసూధనా చారికి దక్కింది. అయినా ఆయనకు తృప్తి లేదు. నిజానికి మధుసూధనా చూరి స్పీకర్‌గా వున్న సమయంలో ఆయన కుమారులు భూపాలపల్లిలో అనేక అరాచాకాలు చేశారిని అప్పట్లో నిరంతరం వార్తలు వచ్చేవి. మండలాలను అన్నదమ్ములు పంచుకొని మరీ రాజకీయంచేస్తున్నారని అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆనాడు తన కుమారులను మధుసూధనాచారి అడ్డుకోలేదు. అప్పుడు చోద్యం చూశారు. దాంతో ఓటమి పాలయ్యారు.
మొన్నటి దాకా మధుసూదనా చారి భూపాల పల్లిలో పంటి కింద రాయి రాజకీయం చేశాడు.
ఎమ్మెల్యేకు అడుగడుగునా తలనొఫ్పులు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆయన కొడుకును ఉసిగొల్పుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భూపాల పల్లిలో అభ్యర్ధి ప్రకటన జరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నోటీసులు జారీ చేయాల్సింది మధుసూధనా చారియే. కాని ఆయన కొడుకే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇప్పటికే మధుసూధాన చారికి ఎమ్మెల్సీ పదవి వుంది. కుటుంబంలో కొడుక్కు కూడా టికెట్‌ కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. పార్టీలో చాల మంది నేతలు తమ వారసులకు కావాలని కోరినా కుదరలేదు. పైగా పార్టీ కోసం ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న వారెంతో మంది టికెట్ల కోసం ఎదురుచూశారు. ఈసారి కూడా వారి ఆశలు నెరకపోయినా పార్టీ లైన్‌ దాటడం లేదు. వాళ్లు నియోజకవార్గాలలో కిరికిరి పెట్టడం లేదు. అలాంటి వారిలో ఖైరతాబాద్‌ నుంచి మన్నె గోవర్ధన్‌ రెడ్డి, కూకట్‌పల్లినుంచి శంభీపూర్‌రాజు, ఉప్పల్‌ టికెట్‌ ఆశించిన బొంతురామ్మోహన్‌ లాంటి వారికే టికెట్‌ దక్కలేదు. ఇక ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి లాంటి వారు కూడా టికెట్‌కోల్పోయారు. అక్కడ ఎక్కడా అసంతృప్తి లేదు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదు. కాని పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ కుమారుడే ఇలా పార్టీల కుంపట్లు రేపుతుండం మాత్రం సహించరానిది.
తన కుమారుడిని ఓ వైపు ఎగదోస్తూ, మరోవైపు నా తన కుమారుడు మాట వినడం లేదంటూ మధుసూధనా చారి చెబుతుండడం విడ్డూరం.
తన కుమారుడే తన మాట వినకనపోతే పార్టీలో ఇతరులు ఆయన మాట వింటారా? తన కుమారుడే వినకపోతే ఆ పదవికి మధుసూధనా చారి అర్హుడా? అన్న ప్రశ్న పార్టీల మొదలైంది. తన కుమారుడిని కంట్రోల్‌ చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేసి, ఇతరులకు ఇస్తే, వాళ్లే చూసుకుంటారని కూడా పార్టీ శ్రేణులే సూచనలు చేస్తున్నాయి. ఇలా ఎమ్మెల్యే అభ్యర్ధికి నిత్యం కిరికిరి పెట్టి, ఎంతో కొంత వసూలు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ దందా సాగుతుందా? అన్న అనుమానం కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతమైన స్ధానంలో వున్న నాయకుడు ఇలాంటి వివాదాలు పొడసూడకుండానే చూసుకోవాలి. అయినా పట్టించుకోవడం లేదంటే పార్టీ శ్రేణులు అనుకుంటున్నది నిజమే అన్న మాటలు నిజం కాకుండాపోవు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *