Farmers Demand Relief from Market Charges
మార్కెట్లో రైతులపై వేసే దాడ్వాయి హమాలి చార్జీలను ప్రభుత్వమే భరించాలి
రైతుల మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించాలి
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శికి మెమోరాండం
నేటిధాత్రి ప్రతినిధి, వరంగల్:
రైతుల పంటలను మార్కెట్లో అమ్ముకునే క్రమంలో వేసే దాడ్వాయి హమాలి ఇతర చార్జీలను మార్కెట్ బడ్జెట్ నుంచే భరించి రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతుల మొక్కజొన్నల కొనుగోలులో జాప్యాన్ని నివారించాలని అఖిల భారత రైతు సమాఖ్య
(ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం స్థానిక ఎనుమాముల మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశంను కలిసి మార్కెట్ సమస్యలపై మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతుల పంటల ఉత్పత్తి ఖర్చులు పెరిగి పండించిన పంటలకు కనీస మద్దతు ధర రాక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని కాపాడుకొనుటకు అన్ని వర్గాల ప్రజానీకం చేయూతనివ్వాలని రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, మద్దతు ధర చట్టం చేయాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని పోరాడాలన్నారు. ఈ క్రమంలో రైతులు పండించిన సరుకులను మార్కెట్లో అమ్ముకునే సందర్భంలో హమాలి దాడువాయి ఇతర చార్జీలను మార్కెట్ బడ్జెట్ నుంచి భరించి చేదోడు వాదోడుగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుత సీజన్లో పండించిన రైతుల మొక్కజొన్నలను కుంటి సాకులతో జాప్యం చేయకుండా బేషరతుగా గోనెసంచులను పరదాలను ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను కల్పించి తక్షణమే కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుంబ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
