45 రోజుల్లో రైతు భరోసా అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది
#50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతు భరోసా చెల్లింపులు లేవు
#కేసీఆర్ హయాంలో రైతులకు గౌరవం, భరోసా ఉండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
#బీఆర్ఎస్ నాయకుడు భూక్య జంపన్న
ములుగు జిల్లా, నేటిధాత్రి:
ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. 45 రోజుల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, నేటికీ 50 రోజులు గడిచినా పూర్తి స్థాయిలో రైతులకు డబ్బులు అందలేదని అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం రెండు ఎకరాల వరకే రైతు భరోసా చెల్లించి, మిగతా రైతులను నిరాశలోకి నెట్టిందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించకపోవడం రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జంపన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు, వ్యవసాయం గుర్తుకు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని గుర్తు చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ముందుగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు అండగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని అన్నారు.
ఈరోజు గ్రామాల్లో రైతులు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ, అప్పటి పరిస్థితులు బాగుండేవని చర్చించుకుంటున్నారని జంపన్న పేర్కొన్నారు. రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని రైతులు ఇప్పటికీ భావిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, వెంటనే రైతు భరోసా నిధులను రైతులందరికీ పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని, లేకపోతే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.A
