గిరిజనులకు ఉచిత వైద్య సేవలు జిల్లా ఎస్పీ…

గిరిజనులకు ఉచిత వైద్య సేవలు జిల్లా ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో, అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో బుధవారం రోజున పోలీస్ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అనంతరం
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవు కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ క్యాంప్ ద్వారా సుమారు 6200 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ (హైదరాబాద్), ఏకశిల హాస్పిటల్ (హనుమకొండ), సిగ్మా హాస్పిటల్, కూరపాటి హాస్పిటల్స్, శరత్ లేజర్ ఐ కేర్ (హనుమకొండ), భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులైన వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 34 మంది వైద్యులు 9 విభాగాల్లో సేవలు అందించారు.
ఈ శిబిరంలో గుండె, మూత్రపిండాలు, జనరల్ మెడిసిన్, స్త్రీరోగాలు, కంటి, చర్మ, చెవి-ముక్కు-గొంతు, ఎముకలు మరియు కీళ్ల సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. అదనంగా రక్త పరీక్షలు, టుడికో ఎకో, ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ ఓ శ్రీదేవి, డీఎస్పీ సూర్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version