మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత
మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మహిళా సంక్షేమం,అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ ,డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి లతో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం,అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ క్రమంలో 30 లక్షల రూపాయల వ్యయంతో 3 గ్రామైఖ్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు.చెన్నూరు నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో 35 భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్,పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు,పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు.మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించి,బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.రుణం పొందిన స్వయం సహాయక సంఘాలు సకాలంలో చెల్లించి తిరిగి రుణం పొంది తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.మహిళలు తాము చేపట్టిన వ్యాపారాలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాయితీ గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.జైపూర్ మండలానికి 753 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 200 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయని,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని అర్హులైన లబ్ధిదారులకు వచ్చే విడతలో అందించడం జరుగుతుందని తెలిపారు.15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.జైపూర్ మండలంలో చేపట్టిన 1 వెయ్యి 250 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని,ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన పట్టాదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా దాదాపు 13 వేల కోట్ల రూపాయలతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ప్రజలతో చెన్నూర్ నుండి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసులను నిర్వహించడం జరుగుతుందని,అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని,ప్రజా సంక్షేమంలో భాగంగా గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్,ఆరోగ్యం, అరైవ్ అలైవ్,సంక్షేమం,పిల్లల భద్రత,వ్యవసాయం,విద్య, యువత,మహిళలు,పర్యావరణం తదితర అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ కార్పొరేటర్లు/కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం మండలంలోని 39 మంది కళ్యాణలక్ష్మి /షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.నిరుపేద ఆడపడుచులకు వివాహానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని,మండలంలో ఇప్పటివరకు 375 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపార రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అదనపు ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలలో కార్యాలయ భవనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళా సమాఖ్య భవనాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టడం జరుగుతుందని,అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను చేయడం జరిగిందని,తద్వారా ప్రభుత్వ పాఠశాలలను 3 శాతం విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామైఖ్య సంఘాల మహిళలు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
