కాళీ కుర్చీకి వినతి పత్రం
* జగ్గంగూడ బిఆర్ఎస్ కౌన్సిలర్ల వినూత్న నిరసన
* ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించని అధికారి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
ప్రజా సమస్యలు పట్టవు. ప్రజా ప్రతినిధులు ఫోన్ చేసిన స్పందన ఉండదు. కలసి మాట్లాడుదామని కార్యాలయానికి వెలితే కనిపించడు. ఈ అధికారితో ఎలా వేగాలంటూ ఆ ప్రజా ప్రతినిధిలు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కాళీ కుర్చీకి వినతి పత్రం అందజేసి ఔరా అనిపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మూడుచింతలపల్లి మునిసిపల్ 13, 14వ వార్డు జగ్గంగూడ లో విద్యుత్ వోల్టేజ్ సమస్య తీవ్రంగా మారింది. దీంతో నూతనంగా 13 వార్డు కౌన్సిలర్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ గూడ జంగారెడ్డిలు పలు మార్లు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పై విద్యుత్ అధికారులు, సిబ్బందికి చెప్పిచూశారు. అధికారుల స్పందన లేకపోవడం పై విసుగెత్తారు. చేసేదేమి లేక మంగళవారం అలియాబాద్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారి లేక పోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఐనా అధికారి వద్దనుండి ఎలాంటి స్పందన లేకపోవడం తో కార్యాలయంలోని ఏఈ కాళీ కుర్చీకి వినతి పత్రం అందజేసి వినూత్ననంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పై స్పందన, ప్రజా ప్రతినిధుల పై గౌరవం లేని అధికారులపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజా సమస్యలు పట్టని విద్యుత్ అధికారి పై చర్యలు చేపట్టాలి : కౌన్సిలర్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి
అలియాబాద్ ఏఈ ఆఫీస్‌కు మా సమస్యను తెలియజేయుటకు వెళ్లాను. కానీ ఆఫీస్‌లో ఏఈ లేరు. సుమారు ఒక గంట పాటు అక్కడే వేచి ఉన్నాము అయినప్పటికీ వారు ఆఫీస్‌కు రాలేదు. వారికి ఫోన్ ద్వారా పలు మార్లు సంప్రదించడానికి ప్రయత్నించాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదివరకు కూడా పలుమార్లు ఫోన్ ద్వారా సమస్యను తెలియజేసినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. అలాగే చాలా సార్లు ఆఫీస్‌కు వెళ్లినప్పుడు కూడా అధికారి గదికి తాళం వేసి ఉండటం గమనించాను. ఈరోజు కూడా గంటసేపు వేచి ఉన్న తరువాత నా వినతిపత్రాన్ని వారి కుర్చీ వద్ద ఉంచి వచ్చాము. అందువల్ల మా సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకొని త్వరగా పరిష్కారం కల్పించవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. జగ్గంగూడ కు ఒక ట్రాస్ఫర్మర్ అవసరం ఉంది. వోల్టేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలో విద్యుత్ పరికరాలు, మోటార్లు, విద్యుత్ దీపాలు పని చేయడం లేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. ప్రజా సమస్యలు పట్టని అధికారి ఉన్న లేనట్లే. పై అధికారులు ఈ విషయం పైన స్పందంచాలి.
