బొందల గడ్డగా మారనున్న పెగడపల్లి గ్రామం
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కి భూములు ఇవ్వడమే మా శాపమా
వింత వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు
కాలుష్య సమస్యలపై పెగడపల్లి గ్రామస్తుల ఆందోళన
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వెదజల్లుతున్న కాలుష్యం వల్ల వింత వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామ ప్రజలు వాపోయారు.పెగడపల్లి గ్రామ ప్రజలు సాగు చేస్తున్న వ్యవసాయ భూములను పవర్ ప్లాంట్ నిర్మాణంలో కోల్పోయి దుర్బర జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం వల్ల తమ బతుకులు మారుతాయని,యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చి గ్రామ అభివృద్ధి చెందుతుందనే ఆశ నిరాశైందని నిరుత్సాహ పడుతున్నారు.థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వెలువడే కాలుష్యం (బొగ్గు దహనం) వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.గాలిలో కలిసే ధూళి, సూక్ష్మ కణాలు,సల్ఫర్ డయాక్సైడ్,నత్రజని ఆక్సైడ్ల వల్ల అస్తమా,ఊపిరితిత్తుల వ్యాధులు,క్యాన్సర్,గుండెపోటు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని,ముఖ్యంగా పిల్లలు,వృద్ధులు,గర్భిణీ స్త్రీలపై ఎక్కువగా ప్రభావితం చూపుతున్నాయని అన్నారు. ఇప్పటికే ప్లాంట్ లో 1200 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 900 మెగావాట్ల కొత్త యూనిట్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.మరో ప్లాంట్ పూర్తయితే భవిష్యత్తులో గ్రామానికి మరింత కాలుష్యం,శబ్ద సమస్యలు,ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోయారు.ఈ నేపథ్యంలో పెగడపల్లి గ్రామ ప్రజలు ఆదివారం ఒకచోట సమావేశమై వారి గ్రామ పరిస్థితిపై చర్చించి ప్రజల ఆరోగ్యం,గ్రామ భవిష్యత్తు రక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే గ్రామ ప్రజలందరూ కలిసి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.ఈ ఆందోళన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి,సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.అదే విధంగా ప్లాంట్ వల్ల కలుగుతున్న తీవ్ర కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెగడపల్లి గ్రామ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి సరైన పునరావాసం రీహాబిలిటేషన్,రీసెటిల్మెంట్ ప్యాకేజీ అందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గ్రామ ప్రజల సమస్యలను అధికారులు,ప్రభుత్వం వెంటనే పరిశీలించి, కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాలని పెగడపల్లి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
