పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్…

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్

 

కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వంపై టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

తిరుపతి, జనవరి 30: కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు (TTD Chairman BR Naidu) స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్‌ ఇచ్చి.. రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
అది మహాపాపం…

చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రాణాంతకమైన కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని.. గత పాలకులు చేసింది మహా పాపమని అన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్‌ ఉందని ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక ఇచ్చిందని.. సిట్‌ నివేదికలో కూడా ఇదే ఉందన్నారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్‌ నివేదికలో పెట్టారని తెలిపారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతా పథకం ప్రకారమే..

వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని.. పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ట దిగజార్చారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసుల కోసం కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారన్నారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు. చినప్పన్న ఎవరు?.. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని నిలదీశారు. అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని.. వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు. హిందూ సమాజానికి జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version