స్వామి వివేకానందుడు యువతకు మార్గదర్శి 

– జాతీయ యువజన దినోత్సవం 12 జనవరి 2025

– వివేకానంద – ఒక నవశకం

– ఒక సామాజిక వైద్యుడు

– యువత మేలుకో… నీ గమ్యాన్ని చేరుకో…

– లేవండి !మేల్కొనండి!!

– యువభారతం

– యువతకు స్ఫూర్తి ప్రదాత-స్వామి వివేకానంద

– వివేకవాణి – యువతకు స్ఫూర్తి మంత్రం

– ధీరనరేంద్రుడు

– నా భారతం – అమర భారతం

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జాతీయ యవజన దినోత్సవాన్ని ప్రతి ఏడాది జనవరి 12న భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ రోజు స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు. స్వామి వివేకానందుడు యువతకు మార్గదర్శకుడిగా, స్పూర్తిదాయకంగా నిలిచిన మహానుభావుడు. ఆయన భావజాలం, సిద్ధాంతాలు, ఉపన్యాసాలు యువతకు ఉత్తేజాన్నిస్తాయి.

*జాతీయ యవజన దినోత్సవం పునాది*

1984లో భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యవజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా యువతలో చైతన్యం నింపడం, వారిని సమాజ నిర్మాణంలో పాల్గొనేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1985 నుండి ఈ రోజును అధికారికంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

 మనిషి తన జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రపంచాన్ని ,సృష్టిని నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు. మనిషి మనుగడ కోసం మరియు మనిషి సుఖంగా జీవించడం కోసం సంబంధించిన వస్తువులను యూరప్ దేశాల వారు కనుగొన్నారు. కానీ, మనిషి శాశ్వతంగా ఆనందంగా గడపడానికి కావలసిన జ్ఞానం ఆసియా ఖండంలో పుట్టింది. 

ప్రపంచం చీకటితో నిండిపోయి, అజ్ఞాన అంధకారంలో నెట్టబడిన ప్రతిసారి ఒక యుగపురుషుడు జన్మిస్తాడు. ఆదిశంకరుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహావీరుడు ఆ కోవకు చెందినవారే.

అత్యంత సంపన్న దేశంగా, సుభిక్షంగా ఉండవలసిన భారతదేశం పరాయి వారి కబంధ హస్తాల కింద నలుగుతున్న కాలం అది. దేశం మొత్తం నిరాశానిస్పృహలతో జీవిస్తున్నారు. ప్రపంచంలో మతం పేరుతో ఒక ఆధిపత్య ధోరణి, అహంకార వైఖరి తో మారణహోమం సృష్టించబడుతున్న సమయం అది. అదిగో! అలాంటి సమయంలో భారతదేశంలో సంక్రాంతి పర్వదినాన కలకత్తా నగరంలో సూర్యుడు సరికొత్త రూపంలో ఉదయించాడు.

భయం ఎరుగని కళ్ళు అవి

తేజస్సుతో కూడిన ముఖం అది

గంభీరమైన గొంతు భలిష్టమైన శరీరం

దేశభక్తి కి నిలువైన రూపం ఆయన

ప్రపంచానికి శాంతి ప్రధాత ఒక స్ఫూర్తి మంత్రం

ఒక ఉప్పెన లాంటి మహా ఋషి

 సామాజిక సమరసతకు ఒక పునాది 

శంకరుని జ్ఞానం , బుద్ధుని హృదయం రెండు మిలితమైన స్వరూపం అది.

ఆయన బ్రతికింది కేవలం 40 సంవత్సారాలే

కానీ ఒక యుగానికి కావాల్సిన సందేశం అందించారు. 

 కొన్ని వేల సంవత్సరాల కి కావలసిన జ్ఞానాన్ని మానవులకు అందించారు.

ఆయన మాటలు తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు. ప్రపంచంలో అన్ని రకాల సమాజానికి చెందిన వ్యక్తుల్లో నూతనోత్తేజం నింపే ఆణిముత్యాలు. అది భూమిపై అవతరించిన ఓ జ్ఞానకాంతి. అది ఓ ధీరగంభీరం.. ఆ గొంతు నీకేం కావాలో చెబుతుంది. అసలు నీకు నీవెవరో తెలియపరుస్తుంది. నిరాశ, నిస్పృహలతో ఓటమి అంచుల దాకా వెళ్లిన కూడా నీలో వెయ్యి ఏనుగుల బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. అదే వివేక వాణి. భారతీయతను, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ తత్త్వచింతనను, దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ధీశాలి మరెవరో కాదు స్వామి వివేకానంద… 

స్వామి వివేకానందుడి జయంతి నేడు (జనవరి 12). ప్రపంచ యవనికపై అత్యంత ప్రభావం చూపిన ఆ మహానుభావుడి పుట్టిన రోజును ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం.

 అలాంటి మహనీయుని గురించి తెలుసుకొని వారి సందేశాన్ని అనుసరించి జీవితాన్ని చక్కదిద్దుకోవాలని బాధ్యత భారత యువత ముందున్న కర్తవ్యం.

 

 *స్వామి వివేకానంద జీవిత చరిత్ర* 

 

*బాల్యం:* 

 బాల్యంలో వివేకానంద స్వామిని , నరేంద్రనాథ్ దత్త గా, ముద్దుగా నరేన్ అని పిలిచేవారు వారి తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి , విశ్వనాధ్ దత్త.

 తన తల్లి చెప్పిన రామాయణం, మహాభారతం కథలు నరేన్ మనస్సు మీద చెరగని ముద్ర వేశాయి.

 పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ప్రశ్నించే తత్వం, ధైర్యము, పేదల పట్ల జాలి, దేశదిమ్మరిగా వచ్చే సన్యాసుల పట్ల ఆకర్షణ మొదలైన గుణాలు నుంచి కనిపించాయి.

 చిన్నతనంలో ఎవరు ఏది చెప్పినా దాన్ని నిరూపించాలని సవాలు చేసేవాడు.సద్గుణాలతో తను ఒక శక్తివంతమైన యువకునిగా ఎదిగాడు.

 *శ్రీరామకృష్ణుల చరణ కమలాల వద్ద:*

 యువకునిగా నరేంద్రనాథ్ తన సింహం లాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగి ఉండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరాన్ని, సుస్వర మైన గొంతును, ప్రకాశమానమైన బుద్ధిని కలిగిఉండేవాడు. చదువులోనూ, తత్వశాస్త్రం లోనూ, సంగీతంలోనూ తన తోటి వారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరెన్నికగన్నడు. కళాశాలలో పాశ్చాత్య తత్వాన్ని అధ్యయనం చేసి వంట పట్టించుకున్నాడు. తద్వారా అతని మనసులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. పుట్టుకతో అలవడిన లక్షణాలైన అధ్యాత్మికత పై మక్కువ, సనాతన మత సంప్రదాయాల మీద, నమ్మకాల మీద గౌరవం ఒకపక్క, మరొక పక్క పదునైన బుద్ధితో జతగూడిన అతని విమర్శనాత్మక స్వభావం ఇప్పుడు ఒక దానితో ఒకటి తలపడ్డాయి. ఇటువంటి సందిగ్ధ సమయంలో, ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మత సాంఘిక ఉద్యమమైనా బ్రాహ్మ సమాజంలో చేరి కొంత ఊరట పొందడానికి ప్రయత్నించాడు. బ్రహ్మ సమాజం నిరాకార దైవాన్ని నమ్మి, విగ్రహారాధనను తులనాడీ అనేక విధాలైన సంస్కరణలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్రనాథ్ అనేకమంది పేరెన్నికగన్న మత నాయకులను కలుసుకున్నాడు. కానీ వారెవరూ, ‘ దేవుడు ఉన్నాడా’ లేడా? అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది అతని అత్యాధునిక అశాంతిని మరింతగా పెంచింది. 1981లో ఆధునిక భారత దేశపు దివ్యదృష్ట అయిన శ్రీ రామకృష్ణునితో పరిచయం కలిగింది.

*పరివ్రాజక సన్యాసి*

 తాత్కాలికమైన యాత్రను ప్రారంభించిన 1888 చివరిభాగం నుంచి 1890 లో తన సోదర బృందాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఊరు పేరు లేని బైరాగి గా పర్యటించడం ప్రారంభించిన అంతవరకు జరిగిన కాలంలో నరేంద్రుడి దృక్పథంలో గొప్ప మార్పు వచ్చింది. భారతదేశపు జనసామాన్యంలో కలిసి పోవడానికి, ఎవరు తను గుర్తు పట్టకుండా ఉండటానికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఆయన పర్యటించసాగారు.

*ప్రపంచ వేదిక మీద విజయం*

 స్వామి వివేకానందులు చైనా, జపాన్, కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి మధ్యభాగంలో చేరుకున్నారు. కాంటన్ లో ఆయన కొన్ని బుద్ధ విగ్రహాలను దర్శించారు. జపాన్ ప్రజల పారిశ్రామిక ప్రగతిని, పరిశుభ్రతను ఎంతగానో మెచ్చుకున్నారు. చికాగో లో ప్రజల కళ్ళు చెదిరే భోగభాగ్యాలను, కొత్త విషయాలను కనిపెట్టే మేధాశక్తిని చూసి ఒక చిన్న పిల్లవాడి లాగా దిగ్భ్రమ చెందారు. విశ్వమత మహాసభ సెప్టెంబర్ వరకు ప్రారంభం కాదని, తగిన పరిచయ పత్రాలు లేనిది ఎవరిని అందులో పాల్గొనడానికి అనుమతించరని తెలుసుకొని నిరాశ చెందారు.

  

 దారి తప్పి పోయినట్టు తోచినా దేవుడి మీద భారం వేసి చికాగో కన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్ళాడు. తను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ క్యాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమైంది. ఆమె తన అతిధిగా వుండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్వర్డ్ విశ్వవిద్యాలయ అనుచరుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయుని తో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయపత్రాన్ని డా. రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా, “విద్యాధికులైన మన ఆచార్యులు అందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ జ్ఞానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు” అని వ్రాశాడు.

       

       సర్వమత మహాసభ ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు స్వామీజీ చికాగో తిరిగి వచ్చారు. కానీ ఆయన దిగులుకుతోడు, ప్రాచీన మత ప్రతినిధులకు ఆతిథ్యాన్ని అందజేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడే రైల్వేస్టేషన్లో ఒక పెద్ద పెట్టెలో తలదాచుకుని, మరునాటి ఉదయం తనకు సహాయం చేయగల మనిషి దొరుకుతాయేమోనని బయలుదేరారు. కానీ, శ్వేతజాతీయులు కానివారికి సహాయం అంత త్వరగా లభించదు. నిష్ఫలంగా, చాలాసేపు అన్వేషించిన అలసిపోయి, అంతా దైవసంకల్పం మీద వదిలి రోడ్డు పక్కన చతికిలపడ్డారు. ఆకస్మాత్తుగా ఆయన ఎదురుగా ఉన్న ఇంటిలో ఉన్న ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి ఆయనకు ఏ సహాయం కావాలి అని అడిగారు. ఆమె ఏ శ్రీమతి జార్జి డబ్ల్యూ హెల్. వారి ఇంటి చిరునామా అమెరికాలో స్వామి శాశ్వత విలాసంగా నిలిచిపోయింది. హెల్ కుటుంబీకులు స్వామి భక్తుడిగా మారిపోయారు.

 

      సర్వమత మహాసభ 1893 సెప్టెంబర్ 11 వ తేదీన ప్రారంభమైంది. కళాసంస్థ (ఆర్ట్ ఇన్స్టిట్యూట్) సభా ప్రాంగణం సుమారు ఏడు వేలమంది జనంతో కిటకిటలాడి పోయింది. వారు ఆ దేశపు ఉత్కంఠ సంస్కృతికి ప్రతినిధులు. వేదిక మీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్ని మతాల ప్రతినిధులు ఆశీనులయ్యారు. స్వామీజీ అటువంటి బ్రహ్మాండమైన, విశ్వవిఖ్యాత లైన వారితో నిండిన సభను ఉద్దేశించి ప్రసంగించలేదు. ఆయన చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు, మనసులో సరస్వతీదేవికి నమస్కరించి,” అమెరికా దేశపు సోదర సోదరీమణులారా!” అని సంబోధించారు. వెనువెంటనే ఆ బ్రహ్మాండమైన సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. పూర్తిగా రెండు నిమిషాలపాటు ఆ కరతాళాలు ఆగలేదు.” ఏడు వేలమంది జనం లేచి నిలబడి తమకు అంతుబట్టని ఏదో ఒక దానికి నివాళులర్పించారు. ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో ఆయన పలికిన పలుకులు, తేజస్సుతో నిండిన ఆయన ముఖ వర్చస్సు, కాషాయ వస్త్రాలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరుసటిరోజు వార్తాపత్రికల స్వామీజీని సర్వమత మహాసభ లో పాల్గొన్న ప్రతినిధులలో అత్యుత్తముడిగా గా కీర్తించాయి. బిక్ష పాత్రతో బయలుదేరిన ఒక సాధారణ సాధువు అందరి మనసులనూ దోచుకున్న వాడిగా ఎదిగిపోయాడు. 

 

 స్వామీజీ అటుపై ఆ మహాసభలో చేసిన ప్రసంగాలు అన్నిటినీ సభికులు గొప్ప గౌరవంతోనూ, ఆసక్తితోనే విన్నారు. అన్నిటిలోనూ విషయము సార్వజనానితే ! సభలో మిగిలిన ప్రతినిధులు తమ తమ గొప్పదనం గురించి మాట్లాడితే స్వామీజీ, ఆకాశమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది అయన మతాన్ని గురించి మాట్లాడారు. మహాసభ ముగియడంతో స్వామీజీ అనామక జీవితం ముగిసిపోయింది.

 

*విజయుడై తిరిగి మాతృభూమికి:*

  వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి 1896 డిసెంబర్ 16వ తేదీన లండన్ నగరాన్ని వదిలి బయలుదేరారు. తదితర దేశాలను సందర్శించిన తరువాత డిసెంబర్ 30న నేపుల్స్ లో భారతదేశానికి వెళ్ళే ఓడను ఎక్కారు. నేపుల్స్ లో జె.జె.గుడ్విన్ వారితో కలిశాడు. 1897 జనవరి 15న కొలంబో చేరుకున్నారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే పాకిపోయింది. ఆహ్వానించాలని ఆతృతతో ఎదురు చూడసాగారు.ఆయన ఇప్పుడు ఒక “అనామక సన్యాసి” ఎంతమాత్రం కాదు.ప్రతి చిన్నా పెద్దా పట్టణంలోనూ ఆయన విజయానికి తగిన ఎదుర్కోలు పలకడానికి ఆహ్వాన సంఘాలు ఏర్పాటయ్యాయి. రోమారోల ఇలా వర్ణించారు: “అత్యుత్సహంతో ఎదురు తెన్నులు చూస్తున్న జనభాహుల్యానికి తన ‘భారతదేశానికి సందేశంతో, రాముడు,కృష్ణుడు,శివుడు పుట్టినగడ్డను పునరుజ్జీవింపజేసే శంఖారావంతో,ఆ జనులు ధీరశక్తినీ, అమర ఆత్మశక్తినీ ఎలుగెత్తి పిలుస్తూ, యుద్ధరంగానికి కదనుత్రొక్కమన్నారు.ఆయన ఒక సేనాధిపతి. తన ‘ఉద్యమ ప్రణాళికను’ వివరించి తన దేశ ప్రజలను ఒక్కుమడిగా లేచిరమ్మని పిలుస్తూ, ‘ ఓ,నా భారత దేశమా! నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా? మరణ మెరుగని నీ ” లోనే”! అని ఉద్బోధించారు. మద్రాసులో ఆయన ఐదు ఉపన్యాసాలను ఇచ్చారు. బలహీనతలనూ, పిచ్చి నమ్మకాలనూ పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. ” ఏ దేశ జాతీయజీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని ” ఆయన బోధించారు. ఆ మతం, ఈ విశ్వమంతా ఆ ఆత్మ స్వరూపమే’ అని బోధిస్తున్నదనీ ఆ మతాన్ని బలోపేతం చేస్తే, మిగిలినవన్నీ వాటికవే చక్కబడతాయనీ బోధించారు. అయితే తన దేశప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. ప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడానికి, పాత కాలపు పిచ్చిపిచ్చి నమ్మకాలని, కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు.

 

*సత్యమే దైవము*

సత్యమే నా దైవం.. విశ్వమే నా దేశం అని ప్రకటించుకున్నారు వివేకానంద. నేను భారతదేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతానని స్పష్టం చేశారు. చెప్పినట్టే తన జ్ఞానసంపదను, ఆధ్యాత్మిక చింతనను విశ్వవ్యాప్తం చేశారు. ప్రాక్‌పశ్చిమ దేశాల్లో వేదాంత భేరిని మోగించిన వివేకానందుడి ప్రతి మాట, సందేశం.. ప్రపంచ యవనికపై అత్యంత ప్రభావితం చూపాయి.

 *స్ఫూర్తి మంత్రం*

కష్టాల్లో ఉన్నప్పుడే మన శక్తియుక్తులు బయటపడతాయని వివేకానందుడు చెప్పారు. అద్భుతాలు సాధించడానికి మూలం మన నమ్మకమేనని అన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా.. నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయని ఆయన చెప్పారు. నిజాయతీగా పనిచేసుకుంటూ పోతే ప్రపంచమంతా ఏకమై నీకు సహకరిస్తుందని బోధించారు. ‘అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే మీ విజయసాధనకు మార్గాలు’ అని వివేకానందుడు చెప్పారు. ఎవరిపైనో భారం వేయకుండా మన శక్తియుక్తులను నమ్ముకోవడమే విజయతీరానికి మార్గం. యువత, విద్యార్థులు, క్రీడాకారులు, సైనికులు, ఉద్యోగులు అందరికీ వర్తించే సూత్రమిది.

 

 

 

*మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి*

భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింపచేయడంలో, యువశక్తిని చైతన్యపరచడంలో వివేకానందుడి కృషి అమూల్యం, అనితరసాధ్యం. ఆయన సూక్తులు నిత్యం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. భవిష్యత్తులోనూ నింపుతాయి. ఆ మాటకొస్తే ఈ భూగోళం ఉన్నంతవరకూ ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో ఆయన స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న నేటి సమాజం వివేకానందుడి సూక్తులతో మరోసారి జాగృతం కావాలి. భారతీయతత్త్వం, మన సనాతన ధర్మం మరోసారి దేదీప్యమానంగా వెలగాలి. ఆ స్ఫూర్తిమంత్రం ప్రపంచానికి కొత్త దారిని చూపాలి. అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.. 

 

 

*డా. జి. సురేంద్ర బాబు*

ప్రధాన కార్యదర్శి 

నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్

 ఎంబిబిఎస్ ,ఎండి పిడియాట్రిక్స్ 

అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్,సిరిసిల్లా

మేనేజింగ్ డైరెక్టర్ : జయవారహి హాస్పిటల్స్ 

నరేన్ ఫౌండేష్ వ్యవస్థాపకులు.

8728081999

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!