STP Decision to Follow Public Opinion
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ఎస్టిపి ఏర్పాటు.
ఈ నెల 18న అవగాహన కార్యక్రమం
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చేరు, నేటి ధాత్రి :
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అమీన్పూర్ పరిధిలో ఎస్టిపి (సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వ్యయంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నంబర్ పరిధిలోని 10 ఎకరాలలో ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటు మూలంగా తమకు దుర్వాసన, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని సమీప కాలనీల ప్రజలు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ శనివారం ఉదయం ప్లాంట్ ఏర్పాటు చేయబోయే స్థలంలోనే.. సంబంధిత శాఖల అధికారులు, కాలనీల ప్రజలతో కలిసి సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమకున్న సందేహాలను అధికారులతో కలిసి నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా అవసరమైన పక్షంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఎస్టీపి ప్లాంట్లను సైతం చూపించబోతున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. సమావేశానికి కాలనీల ప్రజలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
