Sweros Victory Day
ఘనంగా స్వేరోస్ విక్టరీ డే
పరకాల,నేటిధాత్రి
జై భీమ్,జై స్వేరోస్ నినాదాలతో సోమవారం పరకాల మండల కేంద్రంలోని గణపతి డిగ్రీ కళాశాలలో స్వేరోస్ ఇంటర్నేషనల్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్వేరోస్ విక్టరీ డేను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హనంకొండ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు మంద మనోజ్ స్వేరో అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ 2014 మే 25న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన మలావత్ పూర్ణ,సాధనపల్లి ఆనంద్‌లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు.అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం ద్వారా పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు దేశానికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారనే విషయాన్ని నిరూపించారని పేర్కొన్నారు.సంక్షేమ గురుకులాల ద్వారా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.స్వేరోస్ ఉద్యమం,విద్య,స్వాభిమానం,సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొచ్చు రాజు స్వేరో,కోడెపాక సనత్ స్వేరో,పోతుగంటి అర్జున్ స్వేరోతో పాటు స్వేరో అనుబంధ సంఘాల నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
