Resolve Prajavani Applications Quickly
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.మంచిర్యాల పట్టణానికి చెందిన పొగాకు బుచ్చిబాబు తాము కొనుగోలు చేసిన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టి కొంతమేర చేసి అనివార్య కారణాలతో నిలిపివేయడం జరిగిందని,నిర్మాణ గడువును పొడిగిస్తూ అనుమతి పత్రం జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మందమర్రి పట్టణం ఒర్రెగడ్డ ప్రాంతానికి చెందిన బర్ల సుగుణ తన భర్తకు చెందిన ఆస్తిని ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు తన పేరిట మార్పు చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ఈ క్రమంలో ఆస్తి మార్పిడిపై విచారణ జరిపి తమను రక్షించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.నస్పూర్ మండలం సింగాపూర్ కు చెందిన సల్లూరి పోశమ్మ తన భర్త పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఆయన మరణించారని అట్టి ఇంటిని తనకు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.హాజీపూర్ మండలం నమ్నూర్ గ్రామానికి చెందిన మద్దెల గట్టయ్య తనకు గుడిపేట శివారులో గల భూమి రెవెన్యూ రికార్డులలో తప్పుగా నమోదు అయిందని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మంచిర్యాల పట్టణ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బొల్లం సుజాత తాను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ఎల్ 1 జాబితాలో ఉండి ఫేజ్ 1, 2 జాబితాలో పేరు రాలేదని,ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ కు చెందిన గెరిక దుర్గ తాము పూల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని,రెండు పడక గదుల ఇండ్లలో లక్కీ డ్రా పద్ధతిన ఇల్లు వచ్చిందని,సర్వే చేసి ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ సర్వర్ బి తన భర్త చనిపోయాడని,పిల్లల పోషణ కొరకు తనకు ఆసరా పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 91 దరఖాస్తులు వచ్చాయని,ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
