భారతీయ పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాజకీయ అవినీతి
ప్రతీకార రాజకీయాల బాధితులు ఐ.ఎ.ఎస్ ఐ.పి.ఎస్‌లు
రిటైర్ అయిన తర్వాత కూడా వదలని తప్పుడు ప్రచారం
ముక్కుసూటి తనానికి నిజాయతీ ఆఫీసర్లు చెల్లిస్తున్న మూల్యం
నిజాయతీకి దక్కే బహుమానం బదిలీ లేదా సస్పెన్షన్
సివిల్ సర్వెంట్ల భవిష్యత్తును దెబ్బతీస్తున్న రాజకీయ అవినీతి
రాజకీయ నాయకులు ప్రయోగించే ఆయుధం బదిలీ!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఐ.ఎ.ఎస్. లేదా ఐ.పి.ఎస్.కు ఎంపిక కావడం అంత తేలిక కాదు. పెద్దఎత్తున పోటీ, సంక్లిష్టమైన ఎంపిక ప్రక్రియను దాటితే తప్ప ఈ ఉద్యోగహారం మెడలో పడదు. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రామాణికమైన ఎంపికలుగా వీటిని పరిగణిస్తారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్‌వారు ప్రవేశ పెట్టిన ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఎంపిక కావడమనేది భారతీయ సగటు మధ్యతరగతి కు టుంబాల కల! ఈ కలను నిజం చేసుకోవడానికి యువత అహోరాత్రులు కష్టపడి చదువుతారు. సినిమాల్లో గ్లామరస్‌గా చూపే ఈ ఐ.ఎ.ఎస్. మరియు ఐ.పి.స్. పోస్టులను చూసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎట్టకేలకు ఎంపిక అయినవారికి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ పోస్టుకున్న ‘గ్లా మర్’ వెనుక వున్న ‘రాజకీయ అవినీతి మొసళ్ల’ వల్ల అనుక్షణం పొంచివుండే ప్రమాదం స్పష్టం గా అర్థమవుతుంది. తమను తాము సమున్నతంగా ఊహించుకొని ఉద్యోగంలో చేరిన త ర్వాత వీరు స్థానిక ఎమ్మెల్యే లేదా ఎం.పి.తో కలిసి పనిచేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలి. కానీ వీరికి అన్నీ అనుకున్న విధం గా సాగవు. ముఖ్యంగా వీరు సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన రాజకీయ నాయకులు అవినీతిపరులు, నేరచరితులకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ సదుపాయాలను విచ్చలవిడిగా తమ స్వార్థానికి వాడుకోవడం వంటి చర్యలు ఐ.ఎ.ఎస్.లకు నచ్చవు. ఇక్కడినుంచి వీరిమధ్య విభేదాలు మొదలవుతాయి. రాజకీయ వ్యవస్థతో కలిసి సమన్వయంతో పనిచేయడమనే ప్రక్రియ, నిర్దేశించిన విధివిధానాల ప్రకారం ముందుకు పోవడాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. అంటే ఇక్కడ ఈ వ్యవస్థలోనే లోపం వున్నదని అర్థం. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాల్సిన ఐ.ఎ.ఎస్.లపై రాజకీయ వత్తిళ్లు అనివార్యమవుతున్నాయి. వీటికి తలవొగ్గని వారికి బదిలీలు, సస్పెన్షన్లు బహుమతిగా లభిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఐ.ఎ.ఎస్. వంటి కీలక పోస్టుల్లో సమర్థవంత మైన అధికార్లను నియమించాలి. అట్లాకాకుండా అసమర్థులు, అనర్హులను తీసుకొచ్చి ఈ కుర్చీ ల్లో కూర్చోబెడితే, మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే, పదవిలో ఉన్న మంత్రి సహజోద్వేగంపై ప్రతిదీ ఆధారపడివుండటంతో, ఐ.ఎ.ఎస్. అధికార్ల నెత్తిన బదిలీ కత్తి ఎప్పుడూ వేలాడుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం ఏడాదిలోనే 5`6 బదిలీలు ఎదుర్కొన్న అధికార్లు కూడా వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఉద్వేగం, వత్తిడి
ఐ.ఎ.ఎస్. పోస్ట్ అనేది ఇప్పుడొక నాలుగు రోడ్ల కూడలి మాదిరిగా తయారైంది. ఏవైపునుంచి ఏప్రమాదం పొంచివుందో తెలియదు. ఇదే సమయంలో తరచుగా ఒక పోస్టు నుంచి మరో పోస్టుకు మారడం వంటివి కూడా వీరిని విపరీతమైన ఒత్తిడికి గురిచేయడమే కాకుండా, పని నాణ్యత పై ప్రభావం చూపుతున్నాయి. ఎప్పుడైతే ఒక ఐ.ఎ.ఎస్. ఆఫీసర్‌కు ఇటువంటి బాహ్య ప్రేరణల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని ఎదుర్కొనే అంతర్గతశక్తి బలహీనంగా వుంటే వారిలో ఉద్వేగ స్థితి పతాకస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా తాము సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు తయారయ్యే సమయంలో తాము ఊహించుకున్నదానికి, ప్రస్తుతం వివిధ పరిస్థితుల్లో అనుభవంలోకి వస్తున్న వాటికి పొంతన లేకపోవడం వారిలో తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. నిజానికి శ్రేష్ఠత అనేది శిక్షణ ద్వారా, క్రమ అభ్యాసం ద్వారా అలవడుతుంది. చేసిన పనులకు ప్రతిసారి గుర్తింపురాదు. అది తప్పసరి కాదు కూడా! మొత్తంమీద చెప్పాలంటే మన పాలనా వ్యవస్థ సక్రమంగా లే దు. ముఖ్యంగా చూడగానే ఈ వ్యవస్థలో చాలామంది నైతికనిష్ట, నిజాయతీలకు కట్టుబడి లేని వారే ఎక్కువగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఐ.ఎ.ఎస్. అధికార్లు తమ కెరీర్ ప్రయాణంలో ఎ న్నో దోషాలను చూడాల్సి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ అవినీతి!
ప్రజలకు సేవలు అందించలేకపోవడం
ఈ రాజకీయ అవినీతివల్ల ప్రధానంగా ప్రభుత్వం సీనియర్ స్థాయి పాలనాధికార్లుగా ఉన్న ఐ.ఎ.ఎస్. అధికార్లు అభివృద్ధి ఫలాలను ప్రజల చెంతకు తీసుకొని వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, మరికొందరు అధికార్లు కూడా ఆ పార్టీకి వీరవిధేయులుగా పనిచేస్తూ ముందుకెళితే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోక తప్పదు. 1990`2005 మధ్య బిహార్‌ను పరిపాలించిన లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాం ఇందుకు గొప్ప ఉదాహరణ. అవినీతి పరాకాష్టకు చేరుకోవడంతో మొత్తం ఉద్యోగస్వామ్య మే నిర్వీర్యమైపోయింది. ఇటువంటి దురుదృష్టకర పరిస్థితుల్లో నిజాయతీగల ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు పనిచేయలేక నిస్తేజంగా వుండిపోవడమో లేక మరే ఇతర పోస్టుల్లోకి బదిలీ చేయించుకొని వెళ్లపోవడమో చేశారు.
రాజకీయ బాస్‌లకు ఎరగా…
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతగానో జాగరూకతతో వ్యవహరించినా వీరు రాజయ నాయకులు, అవినీతి అధికార్లకు ఎరగా బలవుతున్న సంఘటనలు కోకొల్లలు. నిజాయతీపరులైన ఐ.ఎ.ఎస్. అధికార్లపై చర్యలు తీసుకోవడానికి సరైన కారణాలు దొరక్క, తప్పుడు ప్రచారం చేయడం ఒక అలవాటుగా మారింది. ఈవిధమైన వేధింపులు వీరికి రిటైరయిన తర్వాత కూడా తప్పడంలే దు. అవకాశం దొరికితే నిక్కచ్చి అధికార్లపై ఎంతస్థాయి చర్యలకైనా వెనుకాడని పరిస్థితులు నెల కొన్నాయి. ఇందుకు 2013లో అశోక్ ఖేమ్కా అనే హర్యానా కేడర్ ఐ.ఎ.ఎస్. అధికారి గొప్ప ఉదాహరణ. ఈయన కష్టపడి ఐ.ఎ.ఎస్. సాధించాడు కానీ అవినీతిపై పోరులో వైఫల్యాన్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో రియాల్టీ దిగ్గజమైన ఐ.డి.ఎఫ్. సంస్థకు సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వద్రాకు మధ్య జరిగిన అనుమానాస్పద లావాదేవీపై ఈయన విచారణ చేపట్టాడు. తక్షణమే ఆయనకు బదిలీ బహుమానంగా లభించింది. నిజాయతీగా వ్యవహరించినందుకు తన 22 సంవత్సరాల కెరీర్లో 44 బదిలీలను ఎదుర్కొనాల్సి వచ్చింది. అదేవిధంగా అప్పట్లో తమిళనాడు కేడర్‌కు చెందిన మరో ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ ఉమాశంకర్ 19 బదిలీలను ఎదుర్కొన్నారు. ఆయన అప్పట్లో జయలలిత, ఎం. కరుణానిధి ఇద్దరి హయాంలలో ఐ.ఎ.ఎస్. అధికారిగా పనిచేశారు. ఎటువంటి ప్రాధాన్యం లేని ఒక అంశంపై ఆయన మూడేళ్లపాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నారు. చివరకు సస్పెన్షన్‌ను ఎత్తేసిన తర్వాత ఆయన తన భార్య సూర్యలేఖ మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి టి.వి. ఛానల్ ముందుకు వచ్చి ‘‘రాష్ట్రంలో ఐ.ఎ.ఎస్ మరియు ఐ.పి.ఎస్. అధికార్లకు ఇ చ్చిన ఒక షాక్ ట్రీట్మెంట్గా నా సస్పెన్షన్‌ను పరిగణించాలి’’ అన్నారు.
అశోక్ ఖేమ్కా, ఉమాశంకర్ లాంటి ఐ.ఎ.ఎస్. జాబితా తయారుచేస్తే చాంతాడంత అవుతుంది మరి! ముక్కుసూటి తనానికి లభించే శిక్ష సస్పెన్షన్ కంటే దారుణంగా వుంటుందనేది వీరి చరిత్ర చెబుతుంది. సత్యేంద్ర దూబే అనే ఒక నిఘావేగు (విజిల్ బ్లోయర్) ఇంజినీర్, నరేంద్రకుమార్ అనే మరో ఐ.పి.ఎస్. అధికారి అప్పట్లో నిజాయతీగా తమ విధులను నిర్వర్తించినందుకు ఏకం గా ప్రాణాలే కోల్పోయారు. నరేంద్రకుమార్ మధ్యప్రదేశ్‌లో మైనింగ్ మాఫియాతో ఒంటరి పోరా టం చేశారు. అదేవిధంగా దూబే, బిహార్‌లో హైవే కాంట్రాక్టర్లు పాల్పడుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఆర్.టి.ఐ. చట్టాన్ని ఆశ్రయించారు. నిజానికి ఆర్.టి.ఐ. అవినీతి అక్రమాలను బయటపెట్టడానికి ఉపయోగపడే గొప్ప చట్టమైనప్పటికీ, దురదృష్టవశాత్తు దీన్ని అధికార్లను వేధించడానికి వాడటం విషాదం! 2013లో దుర్గాశక్తి నగ్పాల్ అనే ఒక ఐ.ఎ.ఎస్.అధికారిణికి తాను అప్పటికి ఉద్యోగస్వామ్యంలో (బ్యూరోక్రసీ) చేరిన మూడేళ్లకే తాను చేస్తున్న ఉద్యోగ ప్రయాణం ఎంతగా కంటక ప్రాయమై వున్నదో బాగా అర్థమైంది. అప్పట్లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బుద్ధనగర్‌కు సబ్`డివిజినల్ మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. విధినిర్వహణలో భాగంగా మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు చేపట్టారు. డజనుకు పైగా కేసులు పెట్టడమే కాకుండా పెద్ద సంఖ్యలో వాహనాల ను సీజ్ చేశారు. ఇక్కడినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె చర్యలతో అహం దెబ్బతిన్న సమాజ్‌వాదీ పార్టీ నేతలు, ఆమెను తగినవిధంగా శిక్షించడానికి తగిన కారణాలు దొరక్కపోవ డంతో చివరకు కడాల్పూర్ గ్రామంలో ఒక మతనిర్మాణానికి చెందిన ప్రహరీగోడను అక్రమం గా కూల్చివేశారన్న నెపంతో సస్పెండ్ చేయించారు. మతం అనే ‘చెకుముకి రాయికి’ రాపిడి కలిగిందంటే ఇక క్షమించడానికి ఏమీ వుండదు. అంతా దగ్ధమే! ఇదంతా ఒక చిన్నపిల్లల ఆట మాదిరిగా తయారైంది. వెంటనే సెంట్రల్ ఐ.ఎ.ఎస్. కమిషన్ ఆమెకు మద్దతుగా నిలిచింది. దీంతో కేవలం 41నిముషాల్లోనే ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్న అఖిలేష్ యాదవ్ లేదా ఆయన తండ్రి ములాయంసింగ్ యాదవ్‌కు ఈ సస్పెన్షన్ ఉత్తర్వుపై సంతకం చేసే అధికారం లేదు. కేవలం నోటిమాటగా ఆమె పైఅధికార్లను ఆదేశించగల రు. అంతే! మరి ఆ ఉత్తర్వులపై సంతకం చేసిందెవరు? ఒక సీనియర్ ఐ.ఎ.ఎస్. ఉన్నతాధికారి!! ఈ ఎపిసోడ్లో సస్పెన్షన్ ఎత్తివేత ద్వారా ఆమెకు న్యాయం జరిగింది. కానీ ఈ మచ్చ అమె కె రర్పై ఎంతటి దుష్ప్రభావం కలిగించిందో ఎవరైనా పట్టించుకున్నారా? సివిల్ సర్వెట్లను బెది రించేందుకు రాజకీయ నాయకుల వద్ద వున్న ఒకే ఒక ఆయుధం ‘బదిలీ’. ఆవిధంగా బదిలీ వేటు పడిన సివిల్ సర్వెంట్లలో హర్యానా ఐ.ఎ.ఎస్. అధికారి అశోక్ ఖేమ్కా, యు.పి. కేడర్ అధికారి అమితాబ్ ఠాకూర్లు వంటివారు ఎందరో! ఈ బదిలీ భయంతోనే చాలామంది అధికార్లు ఫైళ్ల విషయంలో గోప్యతను పాటిస్తుంటారు. మరికొందరు తమ పొలిటికల్ బాస్‌ల మనసు నొప్పకుండా పనిచేస్తుంటారు. వీరంతా ఆవిధంగా పనిచేయడానికి దుష్ప్రచారం లేదా బదిలీ భయాలే కారణం.
తప్పించుకునే ఛాన్స్
2012లో ఎమ్మార్ టౌన్షిప్, అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి సి.బి.ఐ. ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికార్లను అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు హోం సెక్రటరీ కావడం విశేషం. ఇక మరికొంతమంది అధికార్లను ప్రశ్నించింది కూడా. ఈ సంఘటపై ఐఏఎస్ అధికార్ల సంఘం స్పందిస్తూ, అక్రమార్కులైన రాజకీయనాయకులను వదిలేసి ఐ.ఎ.ఎస్. అధికార్లను అరెస్ట్ చేయడమేంటని సీబీఐని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన అప్పటి కేబినెట్ మంత్రులు, తమ పేర్లు చెప్పడానికి ఎంత ధైర్యమంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఊగిపోయారు. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ, ‘ఐ.ఎ.ఎస్. అధికార్లపై మంత్రుల ప్రభావం వుంటుంది. కాకపోతే వారిపై ఒత్తిళ్ల ప్రభావం వుండదు’ అని సున్నితంగా చెప్పినా ఎంతటి ఒత్తిడి తెచ్చి అయినా తమ పనులు చేయించుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్యేనన్న సత్యం తెలియందెవరికి? వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై సీబీఐ అప్పట్లో విచారణ జరిపింది. ఇక్కడ విషాదమేంటంటే రాజకీయ నాయకులు తాము తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేసుకునే, ఒక అక్రమంలోకి దిగుతారనేది సత్యం. బలయ్యేది మాత్రం బాధ్యులైన ఐ.ఎ.ఎస్. అధికార్లు!
ప్రతీకార రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16మంది ఐ.పి.ఎస్. అధికార్లకు ఎటువంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా తొక్కిపట్టింది. వీరిలో ఇద్దరు డి.జి.పి.ర్యాంకు అధికార్లు, ఒక అడిషనల్ డి.జి.పి. ర్యాకు అధికారి వున్నారు. విచిత్రమేమంటే పోలీసుశాఖ జారీచేసిన అంతర్గత మెమోలో వీరు మంగళగిరిలోని డిజిపి కార్యాలంలో ఆఫీసర్ల వెయింటింగ్ హాలులో వుంచే రిజిస్టర్లలో తమ హాజరును ప్రతిరోజు ఉదయం పదిగంటలకు నమోదు చేయాలని, అదేవిధంగా తిరిగి వెళ్లేటప్పుడు ఆ సమయం నమోదుచేసి సంతకం చేయాలని పేర్కొంది. అంతేకాదు అత్యవసర సేవలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలని కూడా హుకుం జారీ చేసింది. అసలు విషయమేంటంటే వీరంతా గత వై.ఎస్.ఆర్.సి.పి.ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని తెలుగుదేశం క్యాంపు నిర్ధారించిన నేపథ్యంలో వీరికి ఈ శిక్ష విధించినట్టు అప్పట్లో అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే నిజమైతే, వారిపై తీసుకున్నది రాజకీయ కక్షతో తీసుకున్న చర్యేనని చెప్పక తప్పదు. సివిల్సర్వెంట్లు ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తారు. వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి, పోతాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ నిరంతరా యంగా పనిచేయాల్సిందే. పార్టీల మధ్య వున్న రాజకీయ కక్షలతో వీరిని వేధించడం ఎంతవరక సబబన్న ప్రశ్నకు సమాధం లేదు. పాలనావ్యవస్థకు వెన్నెముకలాంటి ఐ.ఎ.ఎస్. మరియు ఐ.పి.ఎస్.లపై కక్ష సాధింపు చర్యలకు దిగడం పాలనాపరంగా శ్రేయస్కరం కాదు.