Speed Up Paddy Procurement: MLA Gandra
వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం విక్రయించుకునే విధంగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు, మిల్లులకు పంపిణీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఎటువంటి ఆలస్యం ఎదుర్కోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారులు రాములు, కిరణ్ కుమార్ ఆర్టీవో సందాని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
