ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపి వేయాలి
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ఆదివాసి,దళిత,గిరిజన,ప్రజా సంఘాల నాయకుల డిమాండ్..
నేడు ములుగులో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు..
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:
తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాలు గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి,దళిత,గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మూలంగా నిరాయుదులైన ఆదివాసీలు,మహిళలు,చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని,ప్రజలు సాధారణ జీవితం గడపలేక భయాందోళనలు చెందుతున్నారని,తాగు నీరును కూడా సేకరించుకోలేని దీన స్థితిలో చనిపోయే స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సైనిక చర్యను నిలిపివేసి,ఆదివాసి ప్రాంతంలో అభివృద్దిని స్థాపించుటకు తక్షణం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.నేడు ములుగు జిల్లా కేంద్రంలో జరిగే శాంతిర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు,వివిధ ప్రజాసంఘాలు,కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి,జిలుకర శ్రీనివాస్,మాదాసి సురేష్,బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,నున్న అప్పారావు,సిద్ధమైన లక్ష్మీనారాయణ,తెలంగాణ కొమురయ్య,ఐతం నగేష్ బాదావత్ రాజు,అజ్మీర వెంకట్,సిద్దిరాజు యాదవ్ తదితరులు పాల్గోన్నారు.