ఈడీ దాడులపై విచారణనుంచి తప్పుకున్న ఇద్దరు న్యాయమూర్తులు
వెయ్యికోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ
రూ.40వేల కోట్ల స్కామ్ అంటూ ఆరోపిస్తున్న ఏఐడీఎంకె నేత పళనిస్వామి
పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్న ఈడీ
ఇది కక్షసాధింపుచర్య: డీఎంకె
డిఫెన్స్‌లో డీఎంకే
రాష్ట్రప్రభుత్వ సంస్థలపై విచారణకు ఈడీకి అధికారం లేదంటున్న డీఎంకె
భాషావివాదం రేపిన స్టాలిన్‌కు, లిక్కర్ స్కామ్ తలనొప్పి
హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టీఏఎస్‌ఎంఏసీ శాఖలు, ఉద్యోగులపై ఈడీ అధికార్ల దాడులను ఆపాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో మార్చి 25న ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయం తమిళనాడులో దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు విచారణనుంచి తప్పుకోవడంతో ఈ కేసు విచారణపై మరికొంతకాలంపాటు య ధాతథ స్థితి కొనసాగనుంది.
తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఏఎస్‌ఎంఏసీ) మరియు దాని అనుబంధ విభాగాల్లో మార్చి 6వ తేదీనుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలుకొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలను ఈ సంస్థే నియంత్రిస్తుంటుంది. ఈ సంస్థలో బోగస్ లావాదేవీలు నడుస్తున్నాయని, దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిం దంటూ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలు చాలాకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేప థ్యంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఏఐడీఎంకే నాయకులు ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా ఈ స్కామ్ మొత్తం రూ.40వేల కోట్లకు పైమాటేనని ఆరోపిస్తూ మరింత లోతుగా విచారిస్తే అసలు బాగోతం బయటపడుతుందని చెప్పడం విశేషం. చాలాకాలంలో అధికార, విపక్ష పార్టీల మ ధ్య ఈ లిక్కర్ స్కామ్‌పై పరస్పర ఆరోపణలు, విమర్శల దాడులు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం ఈడీ జరుపుతున్న దాడులు ప్రధానంగా 2001`2006 మరియు 2011`2021 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టరేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) నమోదు చేసిన కేసుల ఆధారంగా కొనసాగుతున్నాయనేది డి.ఎం.కె. నేతల ఆరోపణ. ఈ న మోదైన కేసులు అప్పటి ఏఐడీఎంకే మరియు డీఎంకే ప్రభుత్వాల హయాంలలో నమోదైనవేనని వారంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనిట్లలో నమదైన దాదాపు 40 కేసుల ఆధారం గా ఈ దాడులు జరుగుతున్నాయని కూడా డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ మాత్రం తమ తనిఖీల్లో అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ కేసుల్లో నమోదైన కేసులు ప్రధానంగా మూడు కేటగిరీలుగా వున్నాయి. మొదటిది నిర్దేశిత రిటైల్ ధరకంటే ఎక్కువ ధరకు అమ్మడం, రెండవది సరఫరా చేసినందుకు డిస్టిలరీ నుంచి వసూళ్లు చేయడం, ఇక మూడవది టీఏఎస్‌ఎంఏసీ సిబ్బంది బదిలీలకోసం జరిపిన వసూళ్లు. ఇదిలావుండగా తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై ప్రస్తుతం ఈడీ నిఘా కొనసాగుతోంది. టీఏఎస్‌ఎంఏసీ కేంద్ర కార్యాలయం, ఈ స్కామ్‌తో సంబంధమున్న ప్రైవేటు డిస్టిల్లరీ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ స్కామ్‌లో డిస్టిల్లరీలు, అధికార్లు, రాజకీయనాయకులకు ప్రమే యమున్నదని ఈడీ పేర్కొంటున్నది. మరింత లోతైన విచారణ జరిపిన తర్వాత మరిన్ని అరెస్ట్‌లు కొనసాగే అవకాశముందని సంస్థ సూచనప్రాయంగా వెల్లడిరచింది. డీఎంకే నాయకుల ప్రమేయంపై మరింత లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. డిస్టిల్లరీలు, బాటిలింగ్ యూనిట్లలో పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్లు చెబుతున్నారు. అక్రమ చెల్లింపులు, అకౌంట్లలో చూపని నగదు, నకిలీ కొనుగోళ్లు వంటి అనేక గోల్‌మాల్ వ్యవహారాలు నడిచాయని ఈడీ పేర్కొంది. ఈవిధంగా అన్నిరకాల అక్రమాల ద్వారా రూ.వెయ్యికోట్ల మేర ‘లెక్కల్లో చూపని నగదు’ లావాదేవీలు జరిగాయని చెబుతోంది. అయితే దీనిపై విచారణ కొనసా గుతున్నదని ఈడీ పేర్కొంది.అయితే విషయం హైకోర్టుకు చేరడంతో ఈడీ కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్ పడిరది.
డీఎంకే మాత్రం ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనని ఆరోపిస్తోంది. ఇటువంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాల ద్వారా డీఎంకేను దెబ్బకొట్టలేరని రాష్ట్ర న్యాయశాఖ మంత్రిఎస్. రఘుపతి పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ, ‘ఇంకా ఈడీ దాడులు మొదలుకాకముందే బీజేపీ అధ్య క్షుడికి రూ.వెయ్యికోట్ల స్కామ్ జరిగిందని ఎట్లా తెలుసు? ఢల్లీి, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అనుసరించే లిక్కర్ పాలసీలు, తమిళనాడుకు పూర్తి భిన్నం. అటువంటప్పుడు విచారణ పూర్తికాకముందే రూ.వె య్యికోట్ల స్కామ్ జరిగిందని ఈడీ ఎట్లా చెబుతుంది’ అని ప్రశ్నించారు.
ఈడీ దాడుల నేపథ్యంలో టీఏఎస్‌ఎంఏసీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు అక్రమమని, వీటిని తక్షణం నిలిపేసేలా ఆదేశాలివ్వాలని’ కోర్టును అభ్యర్థించింది. మద్యం విధాన రూపకల్పన రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారపరిధిని దాటి ఈ దాడులకు పాల్పడుతున్నదని తన పిటిషన్‌లో పేర్కొంది. దీం తో ఈనెల 20న టీఏఎస్‌ఎంఏసీ అధికార్లపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎఆర్.ఎల్. సుందరేశన్‌కు మౌఖికంగా సూచిస్తూ జస్టిస్ ఎం.ఎస్. రమేష్, జస్టిస్ ఎన్. శాంతికుమార్‌లతో కూడిన బెంచ్, దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి మార్చి 25వరకుఅవకాశం ఇచ్చింది. అప్పటివరకు టీఏఎస్‌ఎంఏసిపై దాడులు జరపవద్దని ఈడీని ఆదేశించింది. విచిత్రంగా మార్చి 25న జరిగిన విచారణలో, ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో ఈడీ దాడుల విచారణపై మరికొంతకాలం సస్పెన్స్ కొనసాగనుంది.
ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న లిక్కర్ స్కామ్ వివాదం అధికార డీఎంకేను స్వీయరక్షణలో పడేసిందనేది సత్యం. బీజేపీ, ఏఐడీఎంకేలకు లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన అస్త్రంగా మారింది. నిజానికి టీఏఎస్‌ఎంఏసీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. లిక్కర్‌కు సంబంధించిన సర్వాధికారాలు ఈ సంస్థ చేతుల్లోనే వుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ హోల్‌సేల్ మరియు రిటైల్ మద్యం పంపిణీ వ్యవహారాలను చూస్తుంది. ఆవిధంగా తమిళనా డులో మద్యం మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతుంటుంది. డిస్టిల్లరీలనుంచి మద్యాన్ని సేకరించి ప్రభుత్వం ఔట్‌లెట్‌ల ద్వారా పంపిణీ చేస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4700 ఔట్‌లెట్‌లుండగా, మొత్తం మద్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.45వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఆవిధంగా లిక్కర్ రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. అయితే టీఏఎస్‌ఎంఏసీ అనుసరిస్తున్న పద్ధతిలో పారదర్శకత లోపించడంతోపాటు, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈడీ చేసిన దాడుల్లో టీఏఎస్‌ఎంఏసీలోని అవినీతి నెట్‌వర్క్ మొత్తం బయటపడినట్టు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, అధికార్లు, మద్యం తయారీదార్లు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా అమ్మకాలు, టెండర్లు, మద్యం సేకరణ విషయాలో అవినీతి విపరీతంగా వున్నట్టు స్పష్టమైంది.
ఈడీ ప్రధానంగా తెలుసుకున్నట్టుగా చెబుతున్న అంశాలీవిధంగా వున్నాయి: 1. డిస్టిల్లరీలో మ ద్యం కొనుగోళ్ల రికార్డుల ను తారుమారుచేయడం. తద్వారా ధరలను విపరీతంగా పెంచేసి షెల్ కంపెనీల ద్వారా బదిలీచేయడం. కొన్ని కంపెనీలు బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం. 2. లిక్కర్ తయారీదార్లు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు విపరీతంగా లంచాలు ఇచ్చి మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. కొన్ని డిస్టిలరీ కంపెనీలకు ఇందులో ప్రధానపాత్ర వుంది. 3. సరైనపత్రాలు లేనివారికి కూడా బార్‌లైసెన్స్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కొ న్ని కంపెనీలకు అనుకూలంగా రవాణా టెండర్లు ఆమోదించడంవల్ల, ఏటా టీఏఎస్‌ఎంఏసీ ఇటువంటి కంపెనీలకు అక్రమంగా రూ.100కోట్ల వరకు చెల్లింపులు జరుపుతోంది. 3. కేవలం లెక్కల్లో చూపని నగదు లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజకీయ పార్టీలకు పంపడం. డిస్టిల్లరీ సంస్థలు ఎగ్జిక్యూటివ్‌లకు మరియు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు మధ్య ప్రత్యక్ష లావాదేవీలను ఈడీ దాడుల్లో గుర్తించారు. అంటే ఇక్కడ క్విడ్ ప్రొ కో నడుస్తోంది. అంతేకాదు టీఏఎస్‌ఎంఏసీ స్టోర్లలో నిర్దేశిత ధరలకంటే 30 నుంచి 40శాతం అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్టు కూడా గుర్తించింది.