రేవంత్‌కు ఎదురులేదు..పొంగులేటికి తిరుగులేదు!

`అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం

`బిఆర్‌ఎస్‌ ను ఎదరించి నిలిచింది రేవంత్‌ రెడ్డి

`తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి

`ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే!

`ఆది నుంచి కేసిఆర్‌ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్‌ రెడ్డి

`నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్‌ రెడ్డి

`ఈ ఇద్దరు ఉత్తర, దక్షిణ దృవాలుగా పార్టీని నిలబెట్టారు

`పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు

`అందుకే పార్టీ పెద్దలు రేవంత్‌ రెడ్డి నిర్ణయాలకే సై అంటున్నారు

`జీర్ణించుకోలేకపోతున్న కొందరు కీలక సీనియర్లు

`సీనియర్ల చెప్పుకునే గొప్పలన్నీ ఇక్కడే

`అధిష్టానం వద్ద వారి మాటలకు చెల్లు చీటే!

`సీనియర్ల మాటలు బారెడు..చేతలు మూరెడు

`ఇప్పటికే సీనియర్లు పదవులందుకున్నారు

`ఇంకా పెత్తనం కోసం పాకులాడుతున్నారు

`సిఎం. రేవంత్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు

`పార్టీ బలోపేతానికి సీనియర్లు చేస్తున్న ప్రయత్నమేమీ లేదు

`పదవులు అనుభవించుకుంటూనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు

`అధిష్టానం వద్ద రేవంత్‌ రెడ్డికున్న ప్రాధాన్యతతో ఖంగుతింటున్నారు

`తమ మాట చెల్లు బాటు కావడం లేదని మధనపడుతున్నారు

`సీనియర్లమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు

`పదేళ్ల కాలంలో నాయకులు కాంగ్రెస్‌ ను వీడుతుంటే ఆపింది లేదు

`కారెక్కకుండా ఆపే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు

`అధిష్టానానికి అబద్దాలు మోయడం మాత్రమే సీనియర్లకు అలవాటు

`పార్టీ కోసం త్యాగం చేయమంటే సీనియర్లు ఒక్కరు కూడా పార్టీలో వుండరు

`మేమే గొప్ప అని చెప్పుకునే వారిలో పార్టీని వీడి వచ్చిన వారున్నారు

`ఇంకా వాళ్లనే నమ్మితే పార్టీని నట్టేట్లో ముంచేస్తారు

`ఇప్పటికీ సీనియర్లకు ఇచ్చిన గుర్తింపే ఎక్కువ

                                  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలోనేనే సీనియర్‌. నాకంటే సీనియర్‌ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అదిష్టానానికి నేనంటే ప్రేమ. అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంత కాలం రాజకీయం చేసుకుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడూ డిల్లీలో వుండేవారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వుండేవారు. కాని వారి వల్ల పార్టీకి ఒక్కశాతం కూడా లాభం వుండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ వుండేవి. ప్రాదాన్యత దక్కుతూ వుండేది. కాని ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ కాలంలో కూడా కొంత మంది పదవులు పొందేవారు. అధిష్టానం వద్ద సానుభూతిని పొందుతూ వుండేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్దపడడం లేదు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. సరిగ్గా గత ఐదు సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్నవారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. డిల్లీకి వెళ్లిపడిగాపులు కాసినా వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీకూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంత మంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కాని వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే లాబీయింగ్‌ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకంటే, మాకే అవకాశమివ్వాలంటూ డిల్లీపెద్దలను కోరుతూ వచ్చారు. కాని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటి దాకా మూడు రోజులపాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంత మందికి అవకాశమిచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రి వర్గంలో కూడా సీనియర్లు మరి కొంత మంది వున్నారు. కాని వాళ్లు ఎప్పుడూ డిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. డిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఓ ముగ్గురు నలుగురు సీనియర్ల మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలుతప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం , పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరూ చేయలేదు. పైగా రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డు పుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులువేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకన పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ మాట్లాడాల్సినన్ని మాటలు మాట్లాడారు. పిపిసి. కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం వుంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి గొప్పగా చెబితే కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్‌ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి వున్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం వుంది. ఇక రేవంత్‌రెడ్డి పిసిసి ప్రెసిడెంటు అయిన తర్వాత ఆయన కింద మేం పనిచేయాలా అంటూ ప్రశ్నించిన వారున్నారు. పార్టీ అదికారంలోకి రాకముందు రేవంత్‌ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంత పారేసుకున్నారు. అసలు రేవంత్‌ రెడ్డి పెత్తనమేమిటంటూ ప్రశ్నిస్తూ వుండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ వుండేవారు. కాని ఆయన బిఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బిజేపిలో చేరి మెదక్‌ నుంచి ఎంపిగా పోటీచేశారు. ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాని ఆయన పార్టీన సంగతి మర్చిపోయి, రేవంత్‌ రెడ్డిపై నోరు పారేసుకునేవారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కపెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఇతర నాయకులు ఎంత మంది ఏది మాట్లాడినా ఎక్కడా పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటినీ చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ, మరోవైపు అప్పటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకులున్నారు. కాని ఏనాడైనా, ఏ ఒక్క నాడైనా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాని, కోమటి రెడ్డి వెంకటరెడ్డిగాని ఈ పదేళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్టు కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కాని రేవంత్‌రెడ్డి ప్రతి నిత్యం పోరాటంచేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హజరు కావడానికికూడా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసిఆర్‌ హాయాంలో వరి వేస్తే ఉరి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసిఆర్‌ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్‌ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసిఆర్‌ మీద పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం వుంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సమయంలో రేవంత్‌రెడ్డికి ఎదరుపడిన మీడియా అభ్యర్ధి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం వుంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అంటూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియా ముందు రేవంత్‌రెడ్డి పరవు తీసినంతపనిచేశారు. కాని ఇప్పుడు అందరూ సుద్దులు చెబుతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా కావాలని కొంత మంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంత మంది పని గట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతోపాటు, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపధం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేశారు. అలా సీనియర్‌ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్లెవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బిఆర్‌ఎస్‌ నుంచి తెచ్చారా? బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి కోవర్టులు అని ముద్ర వేయించుకున్న వాళ్లే కొందరు సినీయర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ది వుందో అర్దంచేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా వుందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్‌ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని, బిజేపిలో చేరి అక్కడ ప్రాదాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హమీఇచ్చారనిచెబుతున్నారు. ఇలాంటి వారికి కోసం బిసి. మహిళామంత్రికొండా సురేఖను పక్కన పెట్టేందుకుకూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలువస్తున్నాయి. కాని అధిష్టానం అన్నీ గమనిస్తూనే వుంటుంది.పైగా దేశంలో అదికారంలోవున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత కీలకమైంది. అందవల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అదిష్టానానికి అంతా తెలుసు. రేవంత్‌ రెడ్డి పార్టీని ఎంతకష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!