బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ హాజరైన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఆదివారం భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం జాతీయతను ప్రతిబింబించింది. ముందుగా రంగు కాగితాలతో అందంగా అలంకరించిన కళాశాల పరిసరాల మధ్య మువ్వన్నెల భారత జాతీయ జెండాను ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఎన్నో దేశాలకు స్ఫూర్తి మన దేశం ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన భారతదేశం గణతంత్ర దేశంగా మారిన తర్వాత ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఇలాంటి దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వారి వారి విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే అది దేశ సేవతో సమానమని, దేశ అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.