50 ఆకుల తునికాకు కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలి
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి డిమాండ్
మహబూబాబాద్/కొత్తగూడ,నేటిధాత్రి:
వేసవి కాలంలో ప్రభుత్వం చేపడుతున్న తునికాకు 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ (ఎంఎల్) కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొత్తగూడ తాసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపెళ్లి రవి మాట్లాడుతూ మరో పంటలాగా సాగుతున్న తునికాకు సేకరణ జరుగుతూ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా దీనిమీదనే ఆధారపడి జీవిస్తుంటారని అలాంటి కష్టానికి అనుగుణంగా 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. ఎండనకా, రాళ్లు, రప్పలు, గుట్టలు ఎక్కుతూ ఎంతో కష్టపడుతూ తునికాకు సేకరించడం జరుగుతుందని, అదేవిధంగా పాము పురుగు అడవి జంతువుల బారిన పడి అనేకమంది చనిపోవడం కూడా గతంలో జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఆలాంటి ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా ప్రమాదవశాత్తు గాయాలు, దెబ్బలు తరిగిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే నేరుగా చెల్లించి వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తునికాకు కల్లాలలో ఇతరత్రా పనులు చేస్తున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులకంటే 20% పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి పూనెం ప్రభాకరన్న, సహాయ కార్యదర్శి ల్యాదల్ల రాజు, నాయకులు కంగాల పాపన్న, కుర్సం రంగన్న, సువర్ణపాక నాగేశ్వరరావు, చిద్రబోయిన పాపన్న, గోగ్గేల లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు.