Woman Worker Falls Ill Due to Heatstroke
వడదెబ్బకు మహిళా కూలీ అస్వస్థత
పరకాల,నేటిధాత్రి
పరకాల వ్యవసాయ మార్కెట్లో శనివారం ఎండ తీవ్రత కారణంగా మహిళా కూలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే పొరండ్ల గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ పరకాల ఐకేపీ సెంటర్లో వడ్ల బస్తాలు నింపే పనిలో నిమగ్నమై ఉండగా తీవ్ర ఎండ ప్రభావంతో అకస్మాత్తుగా కుప్పకూలింది.ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఈఎంటీ మహేందర్, పైలట్ ప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.సమయానికి స్పందించి మహిళకు చికిత్స అందించిన 108 సిబ్బందిని తోటి కూలీలు అభినందించారు.తీవ్ర ఎండల నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.
