Summer Tree Turns Nature Wonder
ఆకులు రాలినా..అందం ఆగలేదు
ఎండాకాలంలో ప్రకృతి రంగుల విందు
పరకాల,నేటిధాత్రి
ఎండలు మండిపోతున్న వేళ ప్రకృతి మాత్రం తన అందాలను చల్లగా చిమ్ముతోంది.మండలంలోని నాగారం గ్రామ రహదారి పక్కన నిలిచిన ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోయినా,ఎర్రటి పూలతో నిండిపోయి అందరినీ ఆకర్షిస్తోంది.ఆకులు లేకుండా కేవలం పూలతోనే కళకళలాడుతున్న ఈ చెట్టు ప్రయాణికులను,ప్రకృతి ప్రేమికులను ఆగి చూసేలా చేస్తోంది.సాధారణంగా చెట్లు ఆకులతోనే అందంగా కనిపిస్తాయని భావిస్తారు.కానీ ఈ చెట్టు మాత్రం ఆకులు లేకున్నా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.కొమ్మలన్నీ ఎర్రటి పూలతో కప్పుకుపోవడంతో దూరం నుంచే ఒక ప్రకృతి చిత్రంలా కనిపిస్తోంది.మండే ఎండలో కూడా ఈ పూల కాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.రహదారిపై వెళ్తున్న వాహనదారులు,స్థానికులు చెట్టు వద్ద కాసేపు ఆగి ఆ అందాలను తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తున్నారు.గ్రామీణ వాతావరణంలో ఇలాంటి ప్రకృతి దృశ్యాలు కనిపించడం అరుదని పలువురు పేర్కొంటున్నారు.ప్రకృతి మనిషికి ఎప్పటికప్పుడు కొత్త అందాలను పరిచయం చేస్తూనే ఉంటుందని,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి ప్రేమికులు సూచిస్తున్నారు.
