Villagers Protest Temple Land Encroachment in Chevella
అమ్మవారి గుడి స్థలం ఆక్రమణ
* ఎమ్మార్వోను కలిసి వినతి పత్రం అందజేసిన అల్లవాడ గ్రామస్తులు
నేటిధాత్రి, చేవెళ్ల :
గుడి స్థలాన్ని కబ్జాచేసి ఇంటి ప్రహరీ నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్లవాడ గ్రామస్తులు బుధవారం చేవెళ్ల ఎమ్మార్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో అదే గ్రామానికి చెందిన బోనగిరి సంజీవ అనే వ్యక్తి గ్రామంలో 50 ఏళ్లుగా పూజాలందుకుంటున్న మైసమ్మతల్లి అమ్మవారి గుడి స్థలాన్ని ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని గుడి స్థలాన్ని కాపాడాలని గ్రామానికి చెందిన మలగళ్ల రామకృష్ణ, మలగళ్ళ శివశంకర్, గ్రామస్థులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుంటున్నామని, అమ్మవారికి గుడి లెనందున పెద్దమనుషుల సహకారంతో త్వరలో గుడి నిర్మాణం చేపట్టదలుచుకున్నామని, ఇంతలోనే సంజీవ అనే వ్యక్తి గుడి స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని ఆరోపించారు.

ఈ ఆక్రమణ పై గ్రామంలో పెద్దమనుషుల పంచాయతీ జరిగిందని, ఈ పంచాయతీలో గ్రామ సర్పంచి, ఉపసర్పంచులు మరికొంతమంది పెద్దమనుషులు చెప్పిన సంజీవ లెక్కచేయకుండా ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ మొండివైఖరి అవలంబిస్తూ ఆక్రమణ కు పాల్పడ్డాడని అన్నారు. ఈ విషయంపై వివాదం చెలరేగటంతో గత నాలుగు రోజుల క్రితం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేశామని రామకృష్ణ, శివశంకర్ తెలిపారు. వెంటనే ఆక్రమణకు గురైన అమ్మవారి గుడి స్థలాన్ని కబ్జాచేరలోంచి విడిపించి, సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ అల్లావాడ గ్రామ అధ్యక్షులు శివగాళ్ల విజయ్ కుమార్, ఎమ్మార్పిఎస్ గ్రామ అధికారప్రతినిధి బోనగిరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
