2025 తెలంగాణకు ఎన్నికల నామ సంవత్సరం
శాసనమండలి, స్థానిక సంస్థలకు ఈ ఏడాదే ఎన్నికలు
బీఆర్‌ఎస్‌కు చావో రేవో
బీజేపీ ఎన్ని గెలిచినా లాభమే
ఈ ఏడాది ఎన్నికలు రేవంత్‌కు అగ్నిపరీక్ష
హైదరాబాద్,నేటిధాత్రి:
మార్చిలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఏడాదిలోపు జరుగబోయే స్థానిక సంస్థలు మరి యు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి గట్టి పరీక్షా కాలంగా చెప్పాలి. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఎదురులేకుండా దూసుకెళుతున్న రేవంత్, విపక్ష బీఆర్‌ఎస్ మూలాలను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీర్‌పై ఏసీబీ, ఈడీ కేసులను నమోదు చేయించి కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడిరదని నిరూపించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే మార్చి 25న జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం ఆయన ఇంకా సమయముంది కదా అని తాత్సారం చేయడం లేదా వేచి చూసే విధానం లేదా ఆచితూచి వ్యవహరించే విధానం వీటిల్లో ఏదో ఒకదాన్ని రేవంత్ అనుసరిస్తున్నారని భావించాలి. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇంకా ఎ మ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే భాజపా మాత్రం తమ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించి రేసులో తానే ముందున్నానని చెప్పకనే చెప్పింది. ఈ ఏడాది జరుగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తేనే రేవంత్ నాయత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సుస్థిరత ఏర్పడుతుంది. ఇవి ఏమైనా తారుమారయ్యాయంటే తిప్పలు తప్పవు.
సహజంగానే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకో సం లాబీయింగ్ ప్రారంభమైంది. వివిధ కేటగిరీల కింద మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 25 నాటికి పదవీకాలం ముగియనుంది. వీటిల్లో ఐదు ఎమ్మెల్యే కోటా కిందివి కాగా, రెండు టీచర్ స్థానాలు, ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం. తాజాగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి భాజపా రేసులో తానే ముందున్నానని నిరూపించింది. ఇప్పటికే రెండు టీచర్స్ యూనియన్లు చెరొక స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిస్తున్నాయి.
భాజపా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. వీరిలో విద్యావేత్త మల్క కొమురయ్య, పారిశ్రామికవేత్త సి. అంజిరెడ్డి, పులి సరోత్తమ్‌రెడ్డి పేర్ల ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వీరిలో కరీంనగర్`ఆదిలాబాద్`నిజామాబాద్`మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమురయ్య (పెద్దపల్లి), నల్గండ`వరంగల్`ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తమ్ రెడ్డి (వరంగల్), గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి సి. అంజిరెడ్డిని భాజపా రంగంలోకి దించింది. నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీకి గట్టి పట్టువుండటంతో విజయావకాశాలు మెండుగా వున్నాయని పార్టీ వ ర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. విశేషమేంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్ల ను ప్రకటించడంలో జాప్యం చేసే వ్యూహాన్ని అనుసరించిన పార్టీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చిదూకుడుగా మిగిలిన పార్టీలన్నింటికంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించి తన చురుకుదనాన్ని ప్రదర్శించింది. మల్క కొమురయ్య పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలను నెలకొల్సారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన బహుకాలంగా భాజపాకు సానుభూతిపరుడిగా వున్నారు. ఇక మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్త. ఆయన భా ర్య గోదావరి అంజిరెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి బీజేపీ యూని ట్‌కు అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇక వరంగల్‌కు చెందిన సరోత్తమ్ రెడ్డి గత 30ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012`2019 వరకు పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శిగా,తెలంగాణ ఉద్యమ కాలంలో టీచర్స్ జేఏసీలో చురుగ్గా పనిచేశారు.
నల్గండావరంగల్‌ాఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డినే యు.టి.ఎఫ్. తమ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించినపీఆర్‌టీయు అభ్యర్థి పూసల రవీందర్‌పై ఆయన విజయం సాధించారు. శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న నాలుగో ఎన్నిక ఇది. 2007 లో జరిగిన తొలి ఎన్నికల్లో విద్యావేత్త చుక్కారామయ్య ఎమ్మెల్సీగా గెలుపొం దారు. 2013లో జరిగిన ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో యుటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం యూటీఎఫ్ తరపున ఈయన మళ్లీ రంగంలోకి దిగనున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆదిలాబాద్`నిజామాబాద్`మెదక్`కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎ మ్మెల్సీగా వున్న జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఇటీవలనే కాంగ్రెస్ తీర్థం పు చ్చుకోవడం, ఎంతమాత్రం ఇష్టంలేదు. ప్రస్తుతం వీరిద్ద రిమధ్య పచ్చగడ్డివే స్తే భగ్గుమనే పరిస్థితినెలకొనడంతో కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం డైలమాలో వుంది.అసంతృప్తితో వున్న జీవన్‌రెడ్డి తిరిగి పోటీచేయడానికి ఇష్టపడకపోతుండటంతో కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఇక పార్టీపరంగా ఆలోచిస్తే నియోజకవర్గంలో 20ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. మరి ఇదే నియోజకవర్గంలో భాజపాకు నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు వున్నారు. బీఆర్‌ఎస్‌కు కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఇక కాంగ్రెస్‌లోఎమ్మెల్యే కోటా కింద సామా రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ స్థానానికిగట్టిపోటీ దారుగా ఉన్నారు. రేవంత్‌తో సాన్నిహిత్యం అనుకూలాంశంగా పేర్కొంటున్నారు. అంతే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున కృషి చేసి గుర్తింపు పొందడం ఆయనకు మరో ప్లస్ పాయింట్ కాగలదంటున్నారు. ఇదే సమయంలో బాల్మూరి వెంకట్, శివసేనారెడ్డి వంటి యువ కాంగ్రెస్‌నాయకులు కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోటీలో వున్నారు.
పరోక్ష ఎన్నికలు
శాసన మండలి సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. శాసనమండలి గరిష్ట సభ్యుల సం ఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో గరిష్టంగా 1/3వ వంతు, కనిష్టంగా 40మంది సభ్యులుండాలి. అంటే రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యపై శాసనమండలి సభ్యుల ఆధారపడివుంటుంది. ఒక రాష్ట్రం శాసన వ్యవహారాల్లో శాసనసభ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. శాసనమండలి సభ్యుల గరిష్ట`కనిష్ట సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ, వాస్తవ సభ్యుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
రాజ్యాంగంలోని 171వ అధికరణం ప్రకారం శాసనమండలి సభ్యులను మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు, ఇతర స్థానిక సంస్థలకు చెందిన సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం శాసనమండలి స భ్యుల సంఖ్యలో 1/12 వంతుమంది సభ్యులను రాష్ట్రంలో నివసిస్తున్న గ్రాడ్యుయేట్లు ఎన్నుకోవా ల్సివుంటుంది. అంటే ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచైనా మూడేళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు అర్హులు. అదేవిధంగా మొత్తం శాసన మండలి సభ్యుల సంఖ్యలో 1/12వ వంతుమంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను, రాష్ట్రంలో కనీసం మూడేళ్లుగా ఏ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడైనా ఎన్నుకునేందుకు అర్హులు. 1/3వ వంతు మండలి సభ్యులను అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. సాహిత్యం, కళలు, సైన్స్, సహకార ఉద్యమం, సామాజిక సేవారంగాల్లో ప్రముఖులను మిగిలిన స్థానాలకు గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆవిధంగా మండలిలో 5/6శాతం మంది సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోగా, మిగిలిన 1/6 సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ చేసే నామినేషన్లను కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. ఆవిధంగా శాసన మండలికి సంబంధించి మూడు రకాల నియోజకవర్గాలుంటాయి. వీటికి సంబంధించి ఓటర్ల జాబితాలను తయారుచేయాలి. ఈ నియోజకవర్గాలనే, లోకల్ అథారిటీస్ నియోజకవర్గం, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం, ఉపాధ్యాయ నియోజకవర్గంగా వ్య వహరిస్తారు.
జీహెచ్‌ఎంసీ రాజకీయం
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా ఈ ఏడాడి డిసెంబర్ నెలాఖరులోగా జరిగే అవకాశముంది. ముందుగా ప్రభుత్వం గ్రేటర్ సిటీ కార్పొరేషన్ (జీసీసీ) లేదా మల్టిపుల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు ముందుకేస్తున్నది. ఇందుకోసం ఔంటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 24 మున్సిపాలి టీలను జీహెచ్‌ఎంసీలో కలిపేయాలన్నది ప్రభుత్వ యోచన. ఈ స్థానిక సంస్థల కాలపరిమితి జనవరితో ముగియనుంది. కాలపరిమితి ముగిసిన వెంటనే వీటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే అవకాశముంది. ఒక్కసారి ఈ విలీన ప్రక్రియ ముగిసిందంటే ప్రభుత్వం జీసీసీ విషయంలో చు రుగ్గా అడుగులు ముందుకు వేయగలదు. ప్రస్తుతం జి.హెచ్.ఎం.సి.లో 146మంది కార్పొరేటర్లు, 50మంది ఎక్స్ అఫిసియో సభ్యులు కలిపి 196మంది వున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 42 మంది కార్పొరేటర్లు, 29మంది ఎక్స్‌అఫిసియో సభ్యులు కలిపి 71 మంది సభ్యుల బలం వుంది.గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లలోనే గెలిచింది. లింగోజీ గూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ మృతితో ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాతి కాలంలో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి 18మంది చేరడంతో కాంగ్రెస్ బలం 24కు పెరిగింది. ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒక కార్పొరేటర్ మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయ డంతో 41 మంది వున్నారు.బీజేపీ 48 స్థానాలో గెలుపొందగా, మొదట్లోనే ఒక కార్పొరేటర్ మరణించడంతో సభ్యుల సంఖ్య 47కు తగ్గింది. అనంతరం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మరణించడం మరికొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బీజేపీ బలం 39గా వుంది. బీఆర్‌ఎస్ 56 సీట్లలో గెలిచింది. బీజేపీ నుంచి నలుగురు చేరడంతో వీరి సంఖ్య 60కి చేరింది. తర్వాత 18మంది కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42మంది వున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల్ విజయలక్ష్మి మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా శ్రీలతా శోభన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఒక్కసారి జీసీసీ ప్రక్రియ మొదలైందంటే ఈ జీహెచ్‌ఎంసీలో స్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం మల్టిపుల్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేయాలనుకున్నా ప్రస్తుత సీట్ల సంఖ్య మాత్రం ఇదేమాదిరిగా వుండే అవకాశం లేదు.
పంచాయతీ ఎన్నికలకోసం వ్యూహాలకు పదును
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 32 గ్రామీణ జిల్లాల్లో, 12769గ్రామపంచాయతీలు, 32 జిల్లా పరిషత్‌లు, 540 మండల పరిషత్‌లున్నాయి. ఇక గ్రామీణ ఓటర్ల సంఖ్య 2,04,59164. గత పంచాయతీ ఎన్నికలు 2019, జనవరి నెలలో మూడు దశల్లో జరిగాయి.కాలపరిమితి ముగిపోతున్న తరుణంలో సర్పంచ్‌లు మరో ఆర్నెల్ల పొడిగింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని రేవంత్ ప్రభు త్వం తిరస్కరించింది. వీరిలో అత్యధికసంఖ్యాకులు బీఆర్‌ఎస్‌కు చెందినవారుకావడం వల్ల , అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలకు, స్థానిక ఎన్నికల్లో వీరు గండి కొడతారన్న భయమే రేవంత్ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించడానికి ప్రధాన కారణం. అయితే ప్రభు త్వం మాత్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పొడిగింపు సాధ్యంకాదని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లు ఒక కొలిక్కిరాకుండా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో లేదు. బీసీ రిజర్వేషన్లను తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్నది పార్టీ వ్యూహం. రాష్ట్రవ్యాప్తంగా తనకు బలమైన నెట్‌వర్క్ వున్నందున స్థానిక ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తుండగా, ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించ డం వల్లనే ఓటమి పాలైందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు గాలి తమకు అనుకూలంగా వున్నదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. 2019నుంచి రాష్ట్రంలో ఓటు షేరును బాగా పెంచుకుంటూ వ స్తున్న బీజేపీ ఉత్సాహంలో ఉన్న ప్పటికీ స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి పార్టీ పనితీరు ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో పార్టీఒక నిర్ణయం తీసుకోనుంది. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్య ర్థులు, జిల్లా పరిషత్ సభ్యులుగా పోటీచేసేందుకు అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో వారు తమ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసే బాధ్యతలను అప్పగించనున్నారు.
ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళుతుండటంతో 2025 తెలంగాణకు మళ్లీ ఎన్నికల సంవత్సరంగా మారనుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.