Iran Slams US & Israel Over Drones
మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ ఘాటు విమర్శలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ షాహెద్-136 మోడల్ డ్రోన్లను రూపొందించి పలు దేశాలపై దాడులకు పాల్పడుతూ.. ఆ నిందను తమపై మోపుతున్నాయని ఇరాన్ మండిపడింది.
ఇటీవల సైప్రస్‌లోని బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరి స్థావరంపై ఓ డ్రోన్ దాడి జరిగిందని.. అయితే దీని వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ సైనిక అధికారి స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక కార్యకలాపాలు అత్యంత క్రమశిక్షణతో కొనసాగుతున్నాయన్నాయని, ఎంపిక చేసిన లక్ష్యాలపైనే తాము దాడులు చేస్తున్నామని తెలిపారు. వారి మోసాలను అడ్డుకునేందుకు ప్రాంతీయ సహకారం అవసరమని సదరు అధికారి వెల్లడించారని ప్రెస్ టీవి పేర్కొంది.
ప్రాంతీయ దేశాలు ఐక్యత, సహకారాన్ని కొనసాగిస్తూ శత్రువుల దురాక్రమణదారులను నిలువరించడంచాలా అవసరమని ఇరాన్ తెలిపినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అగ్రరాజ్య స్థావరాలపై దాడుల పేరిట పశ్చిమాసియాలోని ఆయా దేశాలపై ఇరాన్ పెద్దఎత్తున షాహెద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, ఇజ్రాయెల్ పై ఇరాన్ ఈ విమర్శలు చేసింది.
