జీవో 17ను రద్దు చేయాలి: బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్లు
కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్
సాంఘిక సంక్షేమ మంత్రికి అసోసియేషన్ వినతిపత్రం
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో మంగళవారం సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకే అవకాశం కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు సమన్యాయంతో దాదాపు 15 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ నోటికాడి బుక్క లాక్కొని అడ్డ కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అసోసియేషన్ డిమాండ్లు:
జీవో 17ను రద్దు చేయాలి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయమైన వాటా కల్పించాలి. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లను అమలు చేయాలి. జనాభా ప్రాతిపదికన కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్ర కాంట్రాక్టులను తెలంగాణ కాంట్రాక్టర్లకే ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ వర్గాల కాంట్రాక్టర్లకు ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. టెండర్ నిబంధనలు సులభతరం చేసి చిన్న కాంట్రాక్టర్లు పాల్గొనేలా చేయాలి. ఫ్రీ బిడ్డింగ్ మీటింగ్‌లకు ఎంట్రీ ఫీజులు రద్దు చేయాలి. స్థానిక కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చే నిబంధనలు రూపొందించాలి. కాంట్రాక్టుల్లో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కోఆపరేటివ్ సంస్థల ద్వారా కాంట్రాక్టులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ బాధ్యులు అబ్రార్ హుస్సేన్, నర్రా నిర్మల, సిఆర్ఓ శనిగరం శ్రీనివాస్, మారపెళ్లి మనోజ్, రుద్రావరం సునీల్, బొట్ల కార్తీక్,సిఆర్ఓ రామ్ చందర్, బొట్ల ప్రశాంత్, ఈసంపల్లి రాజు, దుడేలా సిద్దు, అంబాల అఖిల్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
