Congress War Mode On
కాంగ్రెస్ వార్ మోడ్ ఆన్..!
బీజేపీ-బీఆర్ఎస్ టెన్షన్..!
తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఎందుకు దూకుడు పెంచింది..? బీజేపీని టార్గెట్ చేస్తూనే… బీఆర్ఎస్పై కూడా ఒకేసారి యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంటి..? ఇది సాధారణ రాజకీయ వ్యూహమా..? లేక వచ్చే ఎన్నికల ఫలితాలను ఇప్పటినుంచే డిజైన్ చేసే పవర్ గేమ్ ఆరంభమా..? అంటే అవును అనే సమాధానం వస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు కేవలం పాలనపైనే ఫోకస్ చేయడం లేదు. వచ్చే పదేళ్లు కూడా తెలంగాణలో తమ ఆధిపత్యం కొనసాగాలంటే… ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా బలహీనపరచాల్సిందేనని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇకపై కేవలం నాయకుల విమర్శలు కాదు… యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్ వంటి అనుబంధ సంఘాలను నేరుగా ప్రజల్లోకి దింపే ప్లాన్ అమల్లోకి వస్తోంది. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇక నుంచి “గ్రౌండ్ లెవల్ నేరేటివ్ వార్” మరింత తీవ్రంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అసలు లక్ష్యం ఒక్కో పార్టీని విడిగా ఎదుర్కోవడం కాదు… బీజేపీ, బీఆర్ఎస్ రెండింటినీ ఒకే ఫ్రేమ్‌లో నిలబెట్టడం. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని… బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదని… పైగా రెండు పార్టీల మధ్య లోపాయికారీ అండర్స్టాండింగ్ ఉందనే భావనను ప్రజల్లో బలంగా నాటాలని ప్రయత్నిస్తోంది. ఇది రాజకీయంగా చాలా కీలకమైన ఎత్తుగడ. ఎందుకంటే ప్రజలకు “ఈ రెండు పార్టీలూ ఒకటే” అనే ఫీలింగ్ కలిగితే… కాంగ్రెస్‌ను మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించే అవకాశం పెరుగుతుంది.
అందుకే ఇప్పుడు సోషల్ మీడియా నుంచి గ్రామ స్థాయి సమావేశాల వరకు… బీజేపీ మత రాజకీయాలు, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు అనే రెండు నెగెటివ్ ఇమేజ్‌లను ఒకేసారి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలైంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అసలు పోరు కేవలం ఓట్ల కోసమే కాదు… ప్రజల మైండ్‌సెట్‌ను ఎవరు కంట్రోల్ చేస్తారన్నదానిపైన కూడా ఉండబోతోంది.
గత పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాయి. త్రిముఖ పోరులో ఓటు చీలితే ప్రమాదం తప్పదని పార్టీ అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, కీలక నేతల బలహీనతలు, నెరవేరని హామీలన్నింటినీ బయటకు తీస్తూ… రెండు పార్టీలను ఒకేసారి డిఫెన్స్‌లోకి నెట్టే వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంటే తెలంగాణ రాజకీయాలు ఇకపై కేవలం అభివృద్ధి చర్చలతో కాకుండా… భారీ ఇమేజ్ వార్, నేరేటివ్ వార్, రాజకీయ మైండ్ గేమ్స్ చుట్టూ తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
