Grand Ambedkar Jayanti in Mittapelli
మిట్టపెల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
జైపూర్,నేటి ధాత్రి:
మిట్టపెల్లి గ్రామపంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మనోహర్, వార్డ్ సభ్యులు,అంగన్వాడీ విద్యార్థులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వందల ఏళ్ల అణచివేతను తన కలంతో తుడిచివేసి,మనందరికీ రాజ్యాంగం అనే రక్షణ కవచాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు.స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను సమాజానికి అందించిన విశ్వమానవుడు అంబేద్కర్ గారని పేర్కొన్నారు.అట్టడుగు వర్గాల విముక్తి కోసం,సామాన్యుడి ఆత్మగౌరవం కోసం తన జీవితాన్నే అర్పించిన మహామేధావి అని అన్నారు.అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన గౌరవమని,సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.సామాజిక న్యాయం,సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.
