నిపుణులుగా ఎదిగి, వృత్తిలో రాణించండి
గీతం విద్యార్థులకు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ సూచన
నేటి ధాత్రి, పాటన్ చేరు :
ఎంపిక చేసుకున్న రంగంలో నిపుణులుగా ఎదిగి, ఆయా వృత్తులలో మేటివారిగా రాణించాలని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని టెలివిజన్ ప్రసార కోర్సులు, ప్రయోగాత్మక యానిమేషన్, మీడియా నిర్వహణ పద్ధతులు విభాగాధిపతి ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. పూణేలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూ విశ్వవిద్యాలయ సహకారంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో నిర్వహించిన రెండు వారాల ‘జాతీయ విద్యా ఇమ్మర్షన్ కార్యక్రమం’ గురువారంతో ముగిసింది. భవిష్యత్ తరానికి చెందిన మీడియా నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యక్రమ ముగింపు వేడుకలో డాక్టర్ సంజీవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క నిజమైన విలువ కేవలం విద్యాపరమైన వినిమయంలోనే కాకుండా, పాల్గొనేవారి మధ్య ఉన్న జిజ్జాస, సహకారం, పరస్పర సంభాషణ స్ఫూర్తిలో కూడా ఉందని అన్నారు. నూతన ఆవిష్కరణలను, అర్థవంతమైన విద్యాపరమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే వేదికను కల్పించినందుకు ఆయన ఎంఐటీ వర్సిటీకి కృతజ్జతలు తెలిపారు. ఈ చొరవ రెండు సంస్థల మధ్య మరింత బలమైన సహకారానికి నాంది పలికిందన్నారు.ఎంఐటీ-డబ్ల్యూపీయూ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ అను నాయర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో 71 మంది విద్యార్థులఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. గీతంతో మరిన్ని సహకార కార్యక్రమాల కోసం తమ సంస్థ ఎదురు చూస్తోందని ఆమె తెలిపారు. విద్యార్థులు ఆయా సెషన్లలో చురుకుగా పాల్గొన్నారని, ముఖ్యంగా ఆచరణాత్మక అభ్యాస అనుభవాలను ఆస్వాదించారని చెప్పారు.

మే 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఇమ్మర్సన్ కార్యక్రమం, విద్యార్థులకు సమకాలీన మీడియా పద్ధతులు, కమ్యూనికేషన్ వ్యూహాలు, డిజిటల్ స్టోరీటెల్లింగ్, పరిశ్రమ ఆధారిత శిక్షణపై విస్తృతమైన అవగాహనను అందించింది. నిపుణుల ఉపన్యాసాలు, కార్యశాలలు, ముఖాముఖి కార్యక్రమాలు, ఆచరణాత్మక అభ్యాస అనుభవాల ద్వారా, విద్యాపరమైన జ్జానానికి, వృత్తిపరమైన మీడియా పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే ఈ లక్ష్యంగా ఇది కొనసాగింది.రెండు విద్యా సంస్థల అధ్యాపకులు, ప్రముఖులు ఈ ఉమ్మడి కృషిని ప్రశంసించారు. సామాజిక బాధ్యత కలిగిన, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న మీడియా నిపుణులను తీర్చిదిద్దడంలో అనుభవపూర్వక అభ్యాసం, వివిధ రంగాల పరిజ్జానం, విద్యా భాగస్వామ్యాల ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.తమ ప్రతిస్పందనలో విద్యార్థులు ఈ కార్యక్రమం గురించి సానుకూల స్పందనను పంచుకున్నారు. ముఖ్యంగా ప్రయోగాత్మక యానిమేషన్ తరగతులు, మోషన్ గ్రాఫిక్స్ సెషన్లు, ఆడియో ప్రొడక్షన్-సౌండ్ డిజైన్ కార్యశాలలు, అలాగే పీసీఆర్ గదిలో మూడు ప్రాజెక్టులను రూపొందించిన ప్రత్యక్ష అనుభవాన్ని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన రెండు లఘు వీడియోలను కూడా ప్రదర్శించారు.ఇందులో పాల్గొన్నవారు తమ అభ్యాస అనుభవాలను సమీక్షించుకోవడంతో వీడ్కోలు కార్యక్రమం ముగిసింది. అనంతరం సామూహిక ఛాయాచిత్రాల కార్యక్రమం జరిగిందని తెలిపారు
