Promote Organic Farming
రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ సాగు చేయాలి
గీసుగొండ,నేటిధాత్రి:
గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ఉగ్గె మానిక అధ్యక్షతన ‘రైతు ముంగిట్లోకి వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రశాంత్, మానస, మండల వ్యవసాయ అధికారి హారిప్రసాద్, ఏఈఓ సుష్మిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త ప్రశాంత్ మాట్లాడుతూ అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటంతో భూసారం తగ్గి నేల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపారు. యూరియాను తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలని, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. ఒకే పంట వరుసగా సాగు చేస్తే దిగుబడితో పాటు ధరలు కూడా పడిపోతాయని, పత్తి, మొక్కజొన్నలతో పాటు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పారు.మండల కాంగ్రెస్ నేత ఆకుల రుద్ర ప్రసాద్ మాట్లాడుతూ పూర్వీకుల పద్ధతులు వదిలి రసాయనాలు వాడటంతో భూమి నాశనం అవుతోందన్నారు. గ్రామంలో రైతుతో కమిటీ ఏర్పాటు చేసి వచ్చే ఖరీఫ్‌లో రసాయనాల వినియోగం తగ్గిస్తామని, చంద్రయ్యపల్లెను జిల్లాలోనే సేంద్రియ సాగుకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
