Scientists Guide Farmers on Crop Management
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహణ
పంటసాగు పద్ధతులపై అవగాహన
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని రైతు వేదికలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు పంట సాగు యాజమాన్య పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలిపారు.పంటల అధిక ఖర్చులు,పురుగుల పెరుగుదల కారణంగా దిగుబడులు తగ్గి రైతుల ఆదాయం దెబ్బతింటోందని చెప్పారు.పురుగుమందుల అధిక వినియోగం వల్ల పురుగులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నాయని,అలాగే పంటలపై రసాయన అవశేషాలు మిగిలి మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.ఈ సమస్యల నుండి బయటపడేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు(ఐపీఎం)అనుసరించడం అత్యవసరమని సూచించారు.లోతైన దుక్కులు,విత్తన శుద్ధి, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతులను పాటించాలని తెలిపారు.సేంద్రియ ఎరువులకు ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఉపయోగించడం ద్వారా మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు.అలాగే,వేపనూనె పిచికారి,రంగు జిగురు పట్టాల వినియోగం ద్వారా పురుగులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.పత్తి పంటలో బంతి,ఆముదం మొక్కలను పెంచడం ద్వారా కాయతొలచు పురుగుల నివారణ సాధ్యమని,మిరప పంటలో జొన్న,మొక్కజొన్న,సజ్జ వంటి పంటలను అంతర పంటలుగా వేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని సూచించారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి రకాలను సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అరుణ్ కుమార్,ఏఈఓ శైలజ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
