Jana Sena’s National Expansion Plan
రీజనల్ టూ నేషనల్
నిర్మాణం లేని పార్టీకి విస్తరణ సాధ్యమేనా?
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి జాతీయ రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ జెండాను పాతాలని పవన్ కల్యాణ్ గట్టిగా నిశ్చయించుకున్నారు. ఈ విస్తరణ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, సెక్రటరీ రామ్ తాళ్లూరికి అప్పగించగా, ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు ముగిశాయి. త్వరలోనే తమిళనాడులోనూ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమవుతోంది.
అయితే, సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ యంత్రాంగం ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకముందే ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. భవిష్యత్తులో ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న శ్రేణులు, ఏపీని కాదని పక్క రాష్ట్రాల్లో మీటింగ్‌లు పెట్టడంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
పార్టీ నేతల విశ్లేషణ ప్రకారం, పవన్ కల్యాణ్ కేవలం ఒక రాష్ట్రానికో లేదా ప్రాంతానికో పరిమితం కాకుండా ఏ రాష్ట్రంలోనైనా ‘కింగ్ మేకర్’గా ఎదగాలనే భారీ స్కెచ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడే పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తే మైలేజ్ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న ఇమేజ్ను, క్రేజ్‌ను కేవలం అభిమానానికే పరిమితం చేయకుండా, దానిని వ్యవస్థీకృత ఓటు బ్యాంకుగా మార్చే దిశగా జనసేన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
ముఖ్యంగా తమిళనాడుతో పవన్‌కు ఉన్న విడదీయరాని అనుబంధం ఈ విస్తరణలో కీలకం కానుంది. తన బాల్యం, విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగడం వల్ల అక్కడి రాజకీయ, సామాజిక సమీకరణాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. అక్కడి సినీ, రాజకీయ ప్రముఖులతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు పార్టీ పునాదులను బలోపేతం చేస్తాయని జనసేన వర్గాలు నమ్ముతున్నాయి. కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే ఏర్పడిన సానుకూలతను తమిళనాట కూడా కొనసాగించి, దక్షిణాదిలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
జనసేన అంతిమ లక్ష్యం జాతీయ పార్టీ హోదా దక్కించుకోవడమేనని స్పష్టమవుతోంది. సౌత్ ఇండియాలో పట్టు సాధించిన అనంతరం మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీలో పాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా పవన్ కల్యాణ్ తన జాతీయ రాజకీయ కాంక్షను చాటుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయికి జనసేన ప్రయాణం ఏ తీరానికి చేరుతుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
