పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా

విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తులో తరగతులు నిర్వహిస్తూ గాలిలో దీపం పెట్టిన చందంగా విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేట్‌ పాఠశాలలు చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాశాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని విద్యార్థులు, తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతులు ఇవ్వటంలో సంబంధిత శాఖలు విఫలమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదని విద్యార్థులు, మేథావులు భావిస్తున్నారు.

నిద్రమత్తులో సంబంధిత శాఖ అధికారులు

ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులను ఇచ్చే ముందు పర్యవేక్షణాధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించి, సానిటేషన్‌, ఫైర్‌, బిల్డింగ్‌ ఫిట్‌నెస్‌, క్రీడా మైదానం, లైబ్రరీ, మూత్రశాలలు, పార్కింగ్‌, విశాలమైన తరగతిగదులు ఉంటేనే అనుమతులు ఇవ్వవలసిన అధికారులు ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధానంగా బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో అగ్నిప్రమాదాలు జరిగితే, కనీసం ఫైర్‌ ఇంజన్‌ ప్రాంగణం చుట్టూ తిరగలేని విధంగా పాఠశాలల ఆవరణం, గోడలు ఉంటున్నా అధికారులు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారుల ఒక వైపు, ధనార్జనే ద్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్న యజమానులు మరోవైపు. ఈ ఇరువురి మధ్యన అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తుండటం, వాటికి ప్రహారీగోడలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు పైనుండి కిందికి చూసే క్రమంలో, అటు, ఇటు వెళ్లే క్రమంలో అదుపు తప్పి భవనంపై నుండి కింద పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కాశిబుగ్గ పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలపై నుండి పడి చనిపోయిన విషయం నగర ప్రజలకు, విద్యాశాఖ అధికారులకు, యాజమాన్యాలకు తెలిసిందే. అయినా ప్రైవేట్‌ యాజమాన్యాలు కేవలం డబ్బే లక్ష్యంగా పిల్లల ప్రాణాలను లెక్కచేయకుండా విద్యార్థులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అడ్డగోలు భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బరువుకు మించిన పుస్తకాల బ్యాగులను తమ వీపుపై మోసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కి పోయేవి మా పిల్లల ప్రాణాలా…మా విద్యావ్యాపారం వర్థిల్లితే చాలు అనే విధంగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును నగర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *